Supreme Court Grants Bail To Tirupatanna : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా పిటిషనర్ జైలులో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని, ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది.
ట్రయల్‌కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్‌పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్నింటినీ ట్రయల్ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది.
బెయిల్ ఇవ్వొద్దు : అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన పాత్రపై దర్యాప్తునకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని వివరించారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆధారాలు చెరిపేయడంతో కీలకంగా వ్యవహరించారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారన్నారు. తిరుపతన్న పాస్‌పోర్టును వెంటనే సరెండర్ చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలను పారిపోయారని న్యాయవాధి లూథ్రా తెలిపారు.