How to Make Masoor Dal Dosa at Home: దోశలంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇవి క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయి. అయితే ఈ దోశలు ప్లేటులోకి రావాలంటే ముందు రోజే బియ్యం, పప్పు నానబెట్టి రుబ్బాలి. ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్. ఈ కారణంతోనే చాలా మంది హోటల్స్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా ఇన్‌స్టంట్‌గా దోశలు వేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు రొటీన్‌గా చేసేవి కాకుండా వెరైటీగా ఎర్ర కందిపప్పుతో దోశలు వేసుకోవచ్చు. విటమిన్లు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర కందిపప్పుతో దోశలు ఏంటి అని ఆలోచించకుండా ఓసారి వేసుకుని తినండి. టేస్ట్ అద్దిరిపోతాయి. చేయడం కూడా వెరీ ఈజీ. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయట. మరి ఈ దోశలకు కావాల్సిన పదార్థాలు, తయారీపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- మసూర్ దాల్(ఎర్ర కందిపప్పు) - 1 కప్పు
- క్యారెట్ ముక్కలు - అర కప్పు
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఎండు మిర్చి - 3
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి ఎర్ర కందిపప్పును తీసుకుని వీలైనన్ని సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి ఓ అరగంట సేపు నాననివ్వాలి.
- పప్పు నానిన తర్వాత నీళ్లు వడకట్టి మిక్సీజార్‌లోకి వేసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశపిండికి సరిపడే విధంగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి.
- పెనం బాగా హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టి దోశ పిండిని వేసి పల్చగా రుద్దాలి.
- ఇప్పుడు ఫ్లేమ్‌ను హై టూ మీడియం అడ్జస్ట్ చేసుకుని నూనె లేదా నెయ్యి అప్లై చేసి ఎర్రగా కాల్చుకోవాలి.
- రెండో వైపు దోశను తిప్పి మంటను సిమ్‌లో పెట్టి ఓ నిమిషం కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎర్ర కందిపప్పు దోశలు రెడీ. ఇలా పిండి మొత్తాన్ని దోశలుగా పోసుకోవాలి.
- ఈ దోశలను పల్లీ లేదా టమాట లేదా కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
నూనె, పెరుగు, సోడా, పప్పులు లేకుండానే - కమ్మటి "స్పాంజ్ దోశలు"!
బరువు, షుగర్‌ను కొట్టే ఫుడ్ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్!