Tooth Brushing Tips for Kids : మనం ఆరోగ్యంగా ఉండాలంటే దంతాల సంరక్షణ కూడా ముఖ్యమే. అయితే, పెద్దవాళ్లకు దంతాల ఆరోగ్యం, శుభ్రతపై కొంత అవగాహన ఉంటుంది. కానీ, చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పిల్లలు దంత సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్ మార్నింగ్, ఈవెనింగ్ టైమ్లో చిన్నారుల బ్రషింగ్ కోసం కొంత టైమ్ కేటాయిస్తుంటారు.
కానీ, కొందరు చిన్నారులు పళ్లు తోమడానికి మారాం చేస్తుంటారు. తిన్న తర్వాత కూడా దంతాలు శుభ్రం చేసుకోరు. దీంతో అవి ఇట్టే గారపట్టిపోతాయి. అలాగే, రంగూ మారతాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు పేస్టుతో బ్రష్ చేయడానికి ఇష్టపడకపోయినట్లయితే ఈ సహజ పదార్థాలతో క్లీన్‌చేసే ప్రయత్నం చేయండని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నారులు పళ్లు తోమడానికి మారాం చేయకుండా ఉత్సాహంగా చేసేస్తారంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాపిల్ : డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్న సామెత వినే ఉంటాం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా ఈ పండు ముక్కలు నమిలి తినడం వల్ల దంతాలూ శుభ్రపడతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే సహజ ఆమ్లాలు పళ్లపై పేరుకుపోయిన గారను తొలగిస్తాయని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలకు రోజుకో యాపిల్ ఇవ్వడం ఆరోగ్యానికి మాత్రమే కాదు దంత సంరక్షణకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.
స్ట్రాబెర్రీలు : ఈ ఫ్రూట్స్లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలను సహజంగా శుభ్రం చేసి, పాలలా మెరిసేలా చేస్తుందంటున్నారు. అందుకే, పళ్లు తోమడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ పండ్లను కనీసం వారంలో రెండు సార్లయినా తినేలా చూడాలంటున్నారు. విటమిన్ సి తోపాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
మీ పిల్లల్లో దంత సమస్యలా? ఈ టిప్స్ క్యావిటీస్, ఇన్ఫెక్షన్లు నుంచి రిలీఫ్!
బేకింగ్ సోడా : ఇది కూడా పళ్లను శుభ్రపర్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. పిల్లలు అన్నం తిన్న తర్వాత వేలిపై కాస్త వంట సోడా వేసి రుద్దుకోమనండి. రంగు మారిన పళ్లు తెల్లగా మిలమిలలాడతాయంటున్నారు.
సాల్ట్ వాటర్ : అన్నం తిన్నాక నోరు సరిగ్గా పుక్కిలించకపోతే ఆహార వ్యర్థాలు దంతాల్లో ఇరుక్కుపోతాయి. దాంతో అవి పళ్లల్లో క్రిములు పేరుకుపోవడానికి దోహదపడతాయి. ఫలితంగా వివిధ దంత సంబంధిత ఇన్ఫెక్షన్లు, సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే, అలాకాకుండా ఉండాలన్నా, చిగుళ్లు బలంగా మారాలన్నా కాసిని ఉప్పు నీళ్లు నోట్లో పోసి పుక్కిలించి ఊసేయమనండి చాలు.
ఆహారపు అలవాట్లు : వీటితో పాటు దంతాల ఆరోగ్యం కోసం పిల్లలను చక్కెరతో చేసిన స్నాక్స్, డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత వరకూ దూరంగా ఉంచాలి. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పుష్కలమైన నీరు వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వారికి ముందు నుంచే అలవాటు చేయడం చిన్నారులు జీవితకాలం హాయిగా తినడానికి, అందంగా నవ్వడానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు.
టూత్ బ్రష్లను ఎలా వినియోగించాలి? - ఎన్ని రోజులకోసారి మార్చాలో మీకు తెలుసా?