Trains From Prayagraj On Maha Shivaratri : కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. దీనితో ఉత్తర్‌ప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కోట్లాది మంది భక్తులు తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టనున్నారు. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను 350కుపైగా రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
భక్తుల రద్దీ
మౌని అమావాస్య మాదిరిగానే మహా శివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య నాడు 360 రైళ్లను నడిపించినట్లు పేర్కొన్న రైల్వేశాఖ, ఆ రోజు 20లక్షల మంది యాత్రికులను స్వస్థలాలను సురక్షితంగా చేరవేసినట్లు పేర్కొంది. ఇదే విధంగా మహాశివరాత్రి రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక బోగీలను ప్రయాగ్‌రాజ్ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రయాగ్‌రాజ్ రీజియన్లలోని అన్ని స్టేషన్లలో 1500 మంది రైల్వే ఉద్యోగులు, 3000 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు 15,000 సర్వీసులు
జనవరి 13న మొదలైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. మొత్తంగా ఈ 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు 13,500 రైలు సర్వీసులను నడపాలని రైల్వేశాఖ తొలుత ప్రణాళికలు వేసుకుంది. కానీ, 42 రోజులకు ప్రత్యేక రైళ్లు కలిపి ఏకంగా 15000 సర్వీసులను నడిపినట్లు రైల్వేశాఖ తెలిపింది.
రైల్వేశాఖ ప్రకారం, గడిచిన 2 రోజులుగా ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులతో యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. మహా శివరాత్రి నేపథ్యంలో అమృతస్నానం అనంతరం భారీ సంఖ్యలో భక్తులు తిరిగి స్వస్థలాలకు వెళతారు. కనుక భక్తులతో, యాత్రికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని నార్త్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వేలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాదు అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలు వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు.