Telangana Govt is Working to Rescue SLBC Victims : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. నీరు, బురద రూపంలో అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి లోపలికి వెళ్లే అవకాశాలపై జియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ నిపుణుల సాయాన్ని కోరింది. వారి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లనుంది. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ఇవాళ ప్రయోగాత్మకంగా ప్రమాద స్థలికి చేరుకునే అవకాశాలను పరిశీలించి రేపటి నుంచి రంగంలోకి దిగనున్నారు.
అడ్డంకిగా టీబీఎం అవశేషాలు : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో 8 మంది చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు లక్షిత ప్రదేశాన్ని చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకూ పదమూడున్నర కిలోమీటర్ల వరకూ మాత్రమే సహాయక బృందాలు చేరుకోగలుగుతున్నాయి. అక్కడ ధ్వంసమైన టీబీఎం అవశేషాలు అడ్డంకిగా మారాయి.
వెళ్లలేకపోతున్న సహాయక బృందాలు : పది నుంచి పదకొండున్నర కిలోమీటర్ల వరకూ రెండు అడుగుల ఎత్తులో నీరుంది. టీబీఎం మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర లోతైన బురద పేరుకుపోయి ఉంది. అక్కడ వరకూ వెదురు బొంగులు, ధర్మాకోల్ షీట్స్‌తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత దట్టమైన బురద సుమారు ఆరేడు అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకిని దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంది. ఆ ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. పుషింగ్ కెమెరాలు, డ్రోన్లు, సిగ్నిలింగ్ వ్యవస్థ ఎన్ని ఏర్పాట్లు చేసిన ఫలితాలు రావడం లేదు. ఇవాళ 40 మీటర్ల బురదను దాటి టీబీఎం వరకూ చేరుకోలేక పోయిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎలాగైనా అక్కడకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్జీఆర్ఐ నిపుణుల సాయం : ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగం పై నుంచి కానీ, పక్క నుంచి గాని వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ఇవాళ సహాయక బృందాలతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ నిపుణుల సాయాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. కొంత ఆలస్యమైనా ప్రాజెక్టును తిరిగి చేపట్టాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని భావించే వాళ్లు విమర్శలు మానుకోవాలన్నారు.
సహాయక చర్యలపై సంతృప్తి : సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఝార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులు సందీప్ సాహు, జగ్దా జెస్ , సంతోష్ సాహు, అంజూ సాహు కుటుంబ సభ్యులు సైతం ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన రోజునే తమకు సమాచారం అందిందని జిల్లా యంత్రాంగం అన్ని ఖర్చులు భరించి తమను ఇక్కడకు తీసుకువచ్చిందని చెప్పారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో 17 రోజుల తర్వాత 41 మందిని సురక్షితంగా సహాయక చర్యలు చేపట్టి రక్షించారని సహాయక చర్యలు సఫలమైతే తమ కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలతో బయట పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో రెస్క్యూ బృందాలు తప్ప ఇతరులకు టన్నెల్‌లోనికి ప్రవేశాన్ని నిషేధించారు.
ఆ ఎనిమిది మందిని బయటకు తీసుకురావడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాం - మంత్రుల బృందం
Special Video : 'టన్నల్ బోరింగ్ మిషన్' అంటే ఏమిటి? - అది ఎలా పని చేస్తుందో చూడండి
సహాయక చర్యలకు అడ్డంకిగా బురద, వరద - ఆ 8 మంది జాడ తెలిసేందుకు మరిన్ని రోజులు