How To Verify Rs 500 Notes : రూ.500 నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త మార్మోగిపోతోంది. ఎన్ని నోట్లు చలామణిలో ఉన్నాయనే విషయం గురించి కచ్చితమైన సమాచారం లేదు. అయితే మనం రోజూ ఉపయోగించే ఈ నోట్లకు సంబంధించి ప్రతి ఫీచర్ గురించి తెలుసుకోవడం మంచిది. అసలు ఈ నోట్లలో అసలుకు, నకిలీకి తేడా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా గుర్తించండి!
నకిలీ నోట్లను పైపైన చూసి గుర్తించడం కష్టమే. కానీ, కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అసలేదో నకిలీదేదో తెలిసిపోతుంది. అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ ఒరిజినల్ నోటు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ఆర్బీఐ కెహతా హై వెబ్సైట్ ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ రూ.500 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని సూచించేలా ఎర్రకోట ఫొటో ఉంటుంది. నోటు రాతి బుడిద రంగులో ఉంటుంది. ఈ నోటు 66mm*150mm సైజులో ఉంటుంది.
రూ.500 నోటు ఫీచర్లు
ముందు భాగంలో
- 500 సంఖ్య సూచించే లేటెంట్ ఇమేజ్ ఉంటుంది.
- ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 సంఖ్య కనిపిస్తుంది.
- 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది.
- చిన్నగా భారత్(హిందీలో), India అని రాసి ఉంటుంది.
వెనక భాగంలో
- ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
- స్వచ్ఛభారత్ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
- దేశంలోని 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
- లాంగ్వేజ్ ప్యానెల్ పక్కనే దిల్లీలోని ఎర్రకోట చిత్రం కనిపిస్తుంది.
దృష్టి లోపం ఉన్నవారి కోసం ఫీచర్లు
- ఇంటాగ్లియో లేదా పైభాగంలో మహాత్మా గాంధీ చిత్రపటం ముద్రణ
- అశోక స్తంభం చిహ్నం
- 500 సంఖ్య మైక్రోటెక్స్ట్‌తో సర్క్యులర్గా ఉండే గుర్తింపు చిహ్నం
- కుడి, ఎడమ వైపునకు ఐదు యాంగులర్ బ్లీడ్ లైన్లు ఉంటాయి.
నకిలీ నోట్లను కనిపెట్టే యాప్ ఉందా?
నకిలీ కరెన్సీ నోట్లను తనిఖీ చేయడానికి అధికారిక ప్రభుత్వ యాప్ లేదు. అయితే, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తిస్తాయని క్లెయిమ్ చేసుకునే పలు యాప్‌లు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల కచ్చితత్వాన్ని నిర్ధరించడం కష్టం. ఈ యాప్‌లకు ప్రభుత్వ అనుమతి లేదు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరితోనూ వీటికి అనుబంధం లేదు. అయితే ఇలాంటి చాలా యాప్‌లు నోటు డినోమినేషన్ను గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ఆర్బీఐ మనీ యాప్
దృష్టి లోపం ఉన్న వ్యక్తులు కరెన్సీ నోటు విలువను గుర్తించడంలో సహాయపడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లో RBI MANI (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ యాప్) యాప్‌ను ప్రారంభించింది. అయితే, ఈ యాప్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించదు. దృష్టి లోపం ఉన్నవారు/లేదా వినికిడి లోపం ఉన్నవారికి సహాయం చేయడం ఈ యాప్ ప్రాథమిక ఉద్దేశం. ఈ యాప్ తెలుగు, అస్సామీ, బంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఉర్దూతో సహా 11 కంటే ఎక్కువ భారతీయ భాషలలో అందుబాటులో ఉంది.
ఫేక్ కరెన్సీ నోట్లు గుర్తించండిలా!
నకిలీ నోట్లను గురించడానికి నిపుణులు చెప్పిన కొన్ని సూచనలు
- నోటుపై వాటర్‌మార్క్, సెక్యురిటీ థ్రెడ్స్, మైక్రో లెట్టింగ్ ఉన్నాయో లేదో చెక్ చేయండి
- క్యాష్తో లావాదేవీలకన్నా, బ్యాంక్ లావాదేవీలపై దృష్టిపెట్టండి
- అసలు నోట్లను గుర్తించడానికి యూవీ లైట్ లేదా ఆథరైజ్డ్ మెషీన్లను ఉపయోగించండి
వీటిని పరిశీలించిన తర్వాత మీ వద్ద ఉన్న నోటు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఏదైనా బ్యాంకు సిబ్బందిని సంప్రదించింది అసలుదా నకిలీదా నిర్థరించుకోండి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం, 2023-24లో 85,711 మిలియన్ల నకిలీ రూ. 500 కరెన్సీ నోట్లు రిపోర్ట్ అయ్యాయి.
నోట్ల ఫీచర్లు తెలుసుకోవాలంటే ముందుగా https://rbikehtahai.rbi.org.in/know-your-banknotes.html ఈ వెబ్ అడ్రక్కు వెళ్లండి. అనంతరం now your Banknotes బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత రూ.2000 నుంచి రూ.10 వరకు వివిధ నోట్లు ఉన్న మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావాల్సిన నోటుపై క్లిక్ చేయండి. అప్పుడు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి.