Venkatesh Sankranti Ki Vastunnam : విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. దర్శకుడు అనిల్ రావిపూడి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఇది విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలోనే మూవీటీమ్ 'ది రానా దగ్గుబాటి షో'కు వెళ్లి సందండి చేసింది. ఈ ప్రోగ్రామ్‌లో హీరో వెంకటేశ్ జీవితంలో తాను ఆచరిస్తున్న నాలుగు జీవిత సూత్రాలను ఆడియెన్స్‌తో షేర్ చేసుకున్నారు.
'నావరకూ నేనెప్పుడూ జీవితంలో నాలుగు విషయాలు ఫాలో అవుతాను. కష్టపడటం, నివేదించటం, బయటకు వచ్చేయడం, అంగీకరించడం. ఈ నాలుగు సూత్రలను ఆచరిస్తా. మనం ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలి. పని అయిన తర్వాత దాని ఫలితాన్ని ఈ ప్రపంచానికి వదిలేయాలి. ఈ రెండూ ఎంత ముఖ్యమో మరో రెండు కూడా అంతే ముఖ్యం. అవే బయటపడటం, ఫలితాన్ని అంగీకరించడం'
'రోజూ ధ్యానం చేయడం, నా గురువులు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్ల నాకు ఇది సాధ్యమైంది. ఉదాహరణకు నేను 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ చేశా. కష్టపడి నా పని నేను పూర్తి చేశా. దాని నుంచి బయటకు వచ్చేశాను. ఫలితం ఏది వచ్చినా సరే. దాన్ని తీసుకుంటా. ప్రస్తుతం జనాలు ఆందోళనకు గురవ్వడానికి కారణం వారి జీవితంలో జరిగే వాటిని అంగీకరించలేకపోవడమే' అని ఆయన పేర్కొన్నారు.
ఇక సినిమా గురించి కూడా ఆయన మాట్లాడారు. 'సంక్రాంతికి వస్తున్నాం' క్లైమాక్స్ సీన్స్ కొత్తగా ఉంటాయి. ఆడియెన్స్‌కు ఫుల్ థ్రిల్ పంచుతాయి. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఏడు, ఎనిమిది సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయేమో. ప్రతి తెలుగు కుటుంబం నా సినిమాలను ఆదరించింది. అనిల్ రావిపూడితో ఇంత తక్కువ సమయంలోనే మూడు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. సంవత్సరం గ్యాప్ ఇచ్చి మరో సంవత్సరం అనిల్‌తో సినిమా చేస్తా. ఇంట్లో వాళ్లతోనూ ఇదే చెబుతా. స్వచ్ఛమైన వినోదాన్ని అనిల్ అందిస్తారు' అని వెంకటేశ్ తెలిపారు.