Nandamuri Balakrishna Padma Bhushan : నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం శనివారం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కళారంగంలో 30ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణ కేంద్రం పద్మ భూషణ్తో సత్కరించింది. ఇక మరోవైపు బాలయ్యకు పుద్మ పురస్కారం లభించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
1960 జూన్ 10న జన్మించిన నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలోకి వచ్చారు. ఆయన 'తాతమ్మ కల'(1974) చిత్రంతో తెరంగేట్రం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు. 'సాహసమే జీవితం' చిత్రంతో హీరోగా పరిచయమైన బాలకృష్ణ, ఇప్పటివరకు 109 సినిమాల్లో నటించారు. 50ఏళ్ల సినీ ప్రస్థానంలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో అలరించారు.
కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 139 మందికి పురస్కారాలు ప్రకటించింది. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.