Krishna Birth Anniversary :తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది దిగ్గాజాలు తమ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. వాళ్లు ఈ లోకంలో లేనప్పటికీ వారు చేసిన సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి వారిలో దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. 90స్లో ఓ వెలుగు వెలిగిన తారల్లో కృష్ణ ఒకరు. అభిమానులు ఆయన్ను 'ఆంధ్రా జేమ్స్‌బాండ్' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మరికొందరేమో 'డేరింగ్ అండ్ డాషింగ్ హీరో' అంటూ కొనియాడుతారు. ఇంకొందరేమో సూపర్‌స్టార్ అంటూ గర్వంగా పిలుచుకుంటారు. మరి, కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎలా అయ్యారంటే ?
"వందల సినిమాల్లో ఎన్నో కీలక పాత్రలు పోషించిన మిమ్మల్ని ప్రభుత్వం ఏ అవార్డుతోనూ సత్కరించకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి?" అంటూ ఓ విలేఖరి అడగ్గా, దానికి ఆయన చిరునవ్వుతో సమధానామిచ్చారు. "ప్రభుత్వాలు నన్ను గుర్తించలేదని నేనెప్పుడూ బాధపడలేదు. ఆ అవార్డులకంటే ప్రజల గుర్తింపు పెద్దదని నేను భావిస్తాను. వాళ్లు ఇవ్వకపోయినా కూడా కూడా ఫిల్మ్‌ఫేర్ లైఫ్ అఛీవ్‌మెంట్ అందుకున్నాను. 'అంతం కాదిది' సినిమాకిగాను ఉత్తమ నటుడిగా ఓ ప్రముఖ మ్యాగజైన్ నుంచి అవార్డు అందుకున్నాను. ఓ సినీ పత్రిక నిర్వహించిన 'సూపర్‌స్టార్' బ్యాలెట్ పోటీలోనూ వరుసగా ఐదు సంవత్సరాలు నాకు అరుదైన గౌరవం దక్కింది. అప్పటి నుంచే అంతా నన్ను సూపర్‌స్టార్ అని పిలవడం ప్రారంభించారు" అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత, 2009లో భారత ప్రభుత్వం కృష్ణను 'పద్మ భూషణ్'తో సత్కరించింది.
అర్ధ శతాబ్దానికి పైగా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ లెజెండరీ స్టార్ హీరో జయంతి నేడు (మే 31). ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు, సూపర్ స్టార్ అభిమానులు ఆయన్ను గుర్తుచేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మహేశ్ బాబు కూడా తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనలయ్యారు. "హ్యాపీ బర్త్‌డే నాన్న. మిమ్మల్ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలోనూ మీరు ఎప్పటికీ జీవించి ఉంటారు" అంటూ పోస్ట్ చేశారు.