Shahrukh Khan Security : ముంబయిలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు మరింత భద్రత పెంచారు కోల్‌కతా పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో షారుక్ ఉంటున్న హోటల్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన తర్వాత పెరిగిన భద్రతా చర్యల కారణంగా షారుక్ తన హోటల్ గదికే పరిమితమయ్యారట.
మంగళవారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు షారుక్ కోల్‌కతాలోని హోటల్లోనే బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరగడం వల్ల కోల్‌కతా పోలీసులు అప్రమత్తమయ్యారు. షారుక్ నివాసం ఉంటున్న హోటల్‌తో పాటు ఈడెన్ గార్డెన్స్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కింగ్ ఖాన్ తన ఐపీఎల్ జట్టు కేకేఆర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడే మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లి కోల్‌కతాలోని ఓ హోటల్లో ఉన్నారు. ఆ మ్యాచ్‌కు షారుక్‌తో పాటు ఆయన కూతురు సుహానా, కుమారుడు అబ్‌రామ్ ఖాన్ హాజరయ్యారు.
సోమవారం షారుక్ ఖాన్ తన హోటల్ గదిని విడిచిపెట్టి బయటకు రాలేదని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. 'ముంబయిలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిగినప్పటి నుంచి కోల్‌కతాలో షారుక్ భద్రతా వలయంలో కొన్ని మార్పులు జరిగాయి. షారుక్ ఖాన్ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన కోల్‌కతాకు వచ్చినప్పుడు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనతో భద్రత మరింత కట్టుదిట్టమైంది.' అని షారుక్ సన్నిహితుడు ఒకరు ఈటీవీ భారత్‌కు తెలిపారు.