Sankranthiki Vasthunam Extra Shows :విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక వీకెండ్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
సంక్రాంతి సెలవులు కావడం వల్ల థియేటర్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. టికెట్లు దొరకక థియేటర్ నుంచి తిరిగి వెళ్లిపోతున్న ప్రేక్షకులూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులకుతోడు వీకెండ్ కూడా కలిసి రావడం వల్ల మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.