2024 Telugu Pan India Movies Budget : రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేశ్ ఇలా స్టార్ ఇమేజ్ ఉన్న ప్రతి హీరో పాన్ ఇండియా కథలకే మొగ్గు చూపుతున్నారు. వాళ్ల క్రేజ్‌ని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు వెనుకడుగేయడం లేదు. భారీ హంగులతో కథలను సిద్ధం చేయించి కోట్లు కుమ్మరించడానికి రెడీ అంటున్నారు. సినిమా రిజల్ట్ విషయంలో అటూ ఇటూ అయినా సరే, తగ్గేదే లేదంటూ మరో ప్రయత్నం చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకూ!
దర్శక ధీరుడు తీసిన 'ఆర్ఆర్ఆర్' కోసం సుమారు రూ.550 కోట్లు ఖర్చు అయ్యిందని సినీ వర్గాల అంచనా. అయితే అంతకంటే ముందు 'బాహుబలి పార్ట్ 1' కోసం మూవీ టీమ్ సుమారు రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్థాయిని పెంచేసింది ఆ సినిమా. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తెలుగు చిత్ర సీమ ఇక భారీ తరహా సినిమాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే రూ.600 కోట్ల బడ్జెట్‌తో 'కల్కి 2898 AD' తెరకెక్కిందట.
ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్న 'SSMB 28'కూడా దాదాపు రూ.1000 కోట్ల వరకూ బడ్జెట్ ఉంటుందని సినీ వర్గాల అంచనా. ప్రపంచ స్థాయి సాంకేతికత, హంగులతో రూపొందనున్న ఈ చిత్రం గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ తో కూడిన కథగా తెలుస్తోంది. రాజమౌళి గత సినిమాల కంటే కూడా ఇది భారీ వ్యయంతో కూడిన సినిమా అని ట్రేడ్ వర్గాల మాట.
ఇదిలా ఉండగా, రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో కొత్త రకమైన కథతో ప్రయోగం చేశారు. హిస్టారికల్ టచ్ ఉన్న సైన్స్ ఫాంటసీ మూవీతో కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇక తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా కూడా రూ.500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. ఆ తర్వాత మారుతీ దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్' కూడా భారీ బడ్జెటేనని సమాచారం.