తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పిల్లల విద్య, వైద్యం కోసం బాగా ఖర్చు చేస్తున్నారా? ట్యాక్స్‌ బెనిఫిట్స్ పొందండిలా! - Tax Benefits On Children Education - TAX BENEFITS ON CHILDREN EDUCATION

Tax Benefits On Children Education : తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చులు చేస్తుంటారు. అయితే ఇలా చేసిన ఖర్చులపై కూడా పన్ను ప్రయోజనాలు పొందే వీలుందని చాలా మందికి తెలియదు. అందుకే వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tax Benefits On Children Education
Tax Benefits On Children Education (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 11:13 AM IST

Tax Benefits On Children Education : తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవడం సహజం. ఇందుకోసం వారిని బాగా చదివిస్తారు. వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇలా పిల్లల విద్య, వైద్యం కోసం చేసే ఖర్చులపై పన్ను మినహాయింపులు పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఎలాంటి ఖర్చులు, పొదుపులకు తల్లిదండ్రులు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం.

పిల్లల ట్యూషన్‌ ఫీజు
తల్లిదండ్రులు ఉద్యోగులు అయితే, విద్యా సంవత్సరంలో చెల్లించిన ట్యూషన్‌ ఫీజులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పిల్లల విద్య కోసం చెల్లించే ట్యూషన్‌ ఫీజులకు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు ఉంది. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ మినహాయింపు స్వదేశీ విద్యకు (భారత్‌లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో), ట్యూషన్‌ ఫీజులకు మాత్రమే ఉంటుంది. ఈ పన్ను మినహాయింపు ఇద్దరు పిల్లలకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులను మాత్రమే కవర్‌ చేస్తుంది. పార్ట్‌ టైం చదువులు లేదా అంతర్జాతీయ కోర్సులు, రవాణా వంటి ఇతర రుసుములకు ఈ పన్ను మినహాయింపు వర్తించదు.

ఎడ్యుకేషన్ లోన్‌ వడ్డీపై
సామాన్యుల పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలంటే, విద్యా రుణాలు తీసుకోక తప్పదు. అయితే పిల్లలు భారతదేశంలో చదవాలని అనుకున్నా లేదా విదేశాల్లో చదువుకోవాలని ప్లాన్‌ చేసినా, తల్లిదండ్రులు పన్ను మినహాయింపునకు అర్హులు అవుతారు. సెక్షన్‌ 80E కింద, విద్యా రుణాల ఈఎంఐలపై చెల్లించాల్సిన వడ్డీని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తంపై ఎటువంటి పరిమితి కూడా ఉండదు. ఈ నిబంధన ప్రధానంగా అధిక ఆదాయాలు ఉన్న కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80D కింద పిల్లల కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై రూ.25,000 వరకు మినహాయింపు పొందవచ్చు. అదనంగా, పిల్లల ఆరోగ్య పరీక్షల కోసం రూ.5,000 వరకు ఉపపరిమితిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80డీడీ కింద, వైకల్యాలున్న పిల్లల వైద్య చికిత్స, నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అదనంగా సెక్షన్‌ 80డీడీబీ కింద ఎయిడ్స్‌, నరాల వ్యాధులు, ప్రాణాంతక క్యాన్సర్లు వంటి నిర్దిష్ట వ్యాధుల చికిత్స కోసం మినహాయింపులను పొందవచ్చు. సెక్షన్‌ 80డీడీ కింద లభించే మినహాయింపు మొత్తం వైకల్యానికి సంబంధించిన పరిధిపై ఆధారపడి ఉంటుంది. 40% కంటే ఎక్కువ వైకల్యాలకు గరిష్ఠంగా రూ.75,000, తీవ్రమైన వైకల్యాల కోసం రూ.1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన
10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికల కోసం ప్రభుత్వం 'సుకన్య సమృద్ధి యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. సెక్షన్‌ 80సీ కింద ఈ పథకంలో రూ.1.50 లక్షల డిపాజిట్‌పై పన్ను ఆదాతో పాటు డిపాజిట్‌ను ఉపసంహరించుకున్నప్పుడు పన్ను రహిత రాబడిని పొందవచ్చు. ఇది ప్రధానంగా ఆడ పిల్లల ఉన్నత విద్య, వివాహం కోసం ఉద్దేశించినది. ఈ పథకంలో బాలిక పేరు మీదుగా 21 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ ప్రస్తుతం 8.20% వరకు ఉంది. పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ హామీతో లభించే ఏ ఇతర స్కీమ్‌లతో పోల్చినా కూడా దీని వడ్డీ ఎక్కువ. కనీస డిపాజిట్‌గా ఏడాదికి రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఈ పథకంలో మదపు చేయవచ్చు.

పిల్లలకు ఆస్తులు
తల్లిదండ్రులు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తమ దగ్గర ఉన్న నగదును లేదా ఆస్తులను బదిలీ చేయవచ్చు. అప్పుడు ఆ నగదుపై వచ్చే వడ్డీ, ఆస్తిపై వచ్చే అద్దెల ఆదాయం పిల్లల ఆదాయంగా పరిగణిస్తారు. కనుక టెక్నికల్‌గా తల్లిదండ్రుల ఆదాయం తగ్గి, వారు తక్కువ పన్ను స్లాబ్‌లోకి మారతారు. దీని వల్ల చాలా పన్ను ఆదా అవుతుంది. పిల్లల ఉన్నత విద్య, వివాహం కోసం ఇప్పటికే డబ్బు ఆదా చేసిన తల్లిదండ్రులకు ఈ వ్యూహాం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

విద్యా ఖర్చులు
ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్‌ 10(14) ప్రకారం, ఉద్యోగం చేస్తూ జీతం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు, వారి పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులను కవర్‌ చేయడానికి వారి కాస్ట్‌ టు కంపెనీ(CTC)లో భాగంగా కొన్ని అలవెన్సులకు అర్హులు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల కోసం నెలకు రూ.200 చొప్పున సంవత్సరానికి రూ.2400 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక పిల్లవానికి అయితే నెలకు రూ.100 చొప్పున సంవత్సరానికి రూ.1200 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల హాస్టల్‌ ఖర్చులపై నెలకు రూ.300 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.

ట్యాక్స్ బెనిఫిట్స్​ కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Life Insurance Tax Benefits

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ - అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్! - Tax Changes From October 1st 2024

ABOUT THE AUTHOR

...view details