TCS Recruitment 2025 : ఈ సంవత్సరంలో ఉద్యోగ భర్తీలపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక ప్రకటన చేసింది. 2025లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 40వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను భర్తీ చేసుకుంటామని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు - డిసెంబరు త్రైమాసికంలో తమ కంపెనీలో దాదాపు 5వేల మంది ఉద్యోగులు తగ్గారని టీసీఎస్ తెలిపింది. అయినా కొత్త ట్యాలెంట్‌కు, ఫ్రెషర్లకు అవకాశాన్ని కల్పించే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీసీఎస్ ముఖ్య మానవ వనరుల అధికారి (సీహెచ్‌ఆర్‌ఓ) మిలింద్ లక్కడ్ తెలిపిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూద్దాం.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు!
‘‘ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోవు. కేవలం ఉద్యోగాల స్వభావం మాత్రమే మారుతుంది. ఉద్యోగుల పని సామర్థ్యం మరింత మెరుగు అవుతుంది. క్లయింట్‌లతో నేరుగా సంప్రదించాల్సిన విభాగాలు, నాలెడ్జ్ ఎక్కువగా అవసరమయ్యే విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుంది. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యం ఎన్నటికీ తరగదు’’ అని టీసీఎస్ సీహెచ్‌ఆర్‌ఓ మిలింద్ లక్కడ్ వివరించారు.
కోడింగ్ నైపుణ్యాలు సరిపోవు
‘‘టీసీఎస్‌లో ఉద్యోగం పొందే వారికి కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదు. వారికి తగిన విద్యార్హతలు కూడా ఉండాలి. విద్యార్హతలు ఉన్నవారికి సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంటుంది. సేవారంగంలో పనిచేసే వారికి అది తప్పక అవసరం’’ అని మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఒక్క త్రైమాసికంలో ఉద్యోగులు తగ్గితే
‘‘టీసీఎస్‌లో ఇటీవలే కొంతమేర ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అంతమాత్రాన కంపెనీ వృద్ధి మందగించిందని భావించలేం. మొత్తం ఆర్థిక సంవత్సరంలోని ఏదో ఒక త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య కొంతమేర తగ్గితే, దాన్ని కంపెనీ వృద్ధి/డిమాండ్‌తో ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది వార్షిక ప్రణాళికను అనుసరించి జరుగుతుంటుంది. త్రైమాసికంగా చోటుచేసుకునే పరిణామాలతో కంపెనీ గమనం పెద్దగా ప్రభావితం కాదు. ఇటువంటి తాత్కాలిక హెచ్చుతగ్గులను ఆర్థిక సంవత్సరం చివరికల్లా బ్యాలెన్స్ చేసే వ్యూహాలు కంపెనీ వద్ద ఉంటాయి’’ అని మిలింద్ లక్కడ్ చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తప్పకుండా మంచి వృద్ధిరేటు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
టీసీఎస్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఇదీ!
టీసీఎస్ కంపెనీలోని ప్రతీ విభాగం ప్రస్తుతం కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ)ను వినియోగిస్తోంది. దాని ప్రతీ కార్యకలాపంలోనూ ఏఐను వాడుతున్నారు. కంపెనీలోని ఉద్యోగులకు E0 నుంచి E3 వరకు వివిధ స్థాయుల్లో కృత్రిమ మేధ నైపుణ్యాలు ఉన్నాయి.
- E0 (ఎంట్రీ లెవల్): లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), వాటితో ముడిపడిన అప్లికేషన్లపై ప్రాథమిక అవగాహన ఉండే ఉద్యోగులు ఈ విభాగంలోకి వస్తారు.
- E1: ఎల్ఎల్ఎమ్ ఏపీఐలతో పనిచేసే నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజినీర్లు ఈ విభాగంలోకి వస్తారు.
- E2: టీసీఎస్ కంపెనీకి చెందిన జనరేటివ్ ఏఐ టూల్స్‌పై మంచి పట్టు కలిగిన నిపుణులు ఈ విభాగంలో ఉంటారు.
- E3, E3 కంటే ఎక్కువ : అడ్వాన్స్‌డ్ ఏఐపై పట్టు కలిగిన నిపుణులు, దాని అప్లికేషన్లను అన్ని విభాగాల్లో వినియోగించగలిగే వారు ఈ విభాగాలలోకి వస్తారు.