Kudavelly Ramalingeswara Swamy Jatara : దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి పుణ్యక్షేత్రం. రామేశ్వరంపల్లి గ్రామ శివారులో కూడవెల్లి వాగు (మాండవ్య వాగు) సమీపాన వెలిసిన ఆలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కొలువుదీరారు. ఇక్కడ మాఘమ అమావాస్యను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి 31 వరకు జాతర జరగనుంది. శ్రీరాముడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అందుకే రామలింగేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. ఆంజనేయ స్వామి కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన మరోటి ఒకే ప్రాణవట్టం మీద కనిపిస్తాయి.
దక్షిణ కాశీ జాతర : ప్రతి ఏటా పుష్య బహుళ మాఘ అమావాస్య రోజున జాతర మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది. కూడవెళ్లి వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి, స్వామివారిని దర్శించుకుంటారు. రాధా, రుక్మిణీ సహిత వేణుగోపాలస్వామి, దాసాంజనేయస్వామి, కుమార స్వామి, వీరభద్ర స్వామి, పార్వతి, గణపతి ఆలయాలూ ఇక్కడ ఉన్నాయి.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : ఉమ్మడి జిల్లావాసులతో పాటు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. బందోబస్తుకు 130 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని, భక్తుల రక్షణ కోసం వాగు వద్ద 10 మంది గజ ఈతగాళ్లను నియమించామని దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్ తెలిపారు.
విశేష పూజలు : జాతర బుధవారం నుంచి మొదలుకావడంతో ముందు రోజు (మంగళవారం) గణపతి పూజ, పుణ్యహవచనం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని పులిగుండ్ల వద్ద స్వామిని అభిషేకిస్తారు. అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. మూడు రోజులూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పుష్పార్చన, బిల్వార్చన, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
"జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వాగు సమీపంలో స్నానాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించాం. వాగులో లోతైన ప్రాంతాలకు వెళ్లొద్దు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలి. అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచాం." -పి.విశ్వనాథశర్మ, ఈవో
వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు - భారీగా తరలివచ్చిన భక్తులు
ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే శివాలయం - దర్శనానికి క్యూ కట్టిన భక్తజనం - మన తెలంగాణలోనే