ETV Bharat / state

మీకు రిజర్వేషన్ కావాలంటే ఆ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే - హైకోర్టు - HIGH COURT ON EWS CERTIFICATE

హాస్టల్ సంక్షేమ అధికారి పోస్టుకు దరఖాస్తు చేసిన తిరుపతి అనే వ్యక్తి - 2021-22 నాటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను సమర్పించలేకపోయిన అభ్యర్థి - రిజర్వేషన్ పొందాలంటే నాటి సర్టిఫికెట్​నే సమర్పించాలని హైకోర్టు ఆదేశం

EWS CERTIFICATE ISSUE
TELANGANA HIGH COURT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 9:52 PM IST

Telangana High Court on EWS Certificate Issue : గిరిజన సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని ఓ అప్పీలు సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. దానికి విరుద్ధంగా తరువాతి సంవత్సరాల ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను అనుమతించే ప్రక్రియను ఆదేశించలేమని పేర్కొంది. గిరిజన సంక్షేమ శాఖలోని పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో తాత్కాలిక జాబితాను 2024లో విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే 2021-22 నాటి ధ్రువీకరణ పత్రాన్నే సమర్పించాలని కోరింది.

నిరాకరించిన టీజీపీఎస్సీ : హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-2 పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్ధిపేటకు చెందిన కె. తిరుపతి అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించగా టీజీపీఎస్సీ నిరాకరించింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి కూడా తిరస్కరించారు. వెంటనే తిరుపతి హైకోర్టులో అప్పీలును దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రస్తుత సంవత్సరాలవే చెల్లుబాటు : ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రస్తుత సంవత్సరాలకే జారీ చేయాలని, గతేడాదికి సంబంధించిన దానికి విడుదల చేయరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషనర్ తిరుపతి 2021-22 సర్టిఫికెట్‌ను సమర్పించలేకపోతున్నట్లు చెప్పారు. అయితే టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్నవారందరూ 2021-22 నాటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను సమర్పించారని, అందువల్ల అధికారులు ధృవీకరణ పత్రాలను జారీ చేయలేదనే కారణం సరికాదన్నారు.

అప్పీలును కొట్టివేసిన హైకోర్టు : నోటిఫికేషన్​లోనే 2021-22 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించాలని, దరఖాస్తు చివరి తేదీ నాటి ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాన్నే సమర్పించాలని స్పష్టంగా పేర్కొన్నట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ 2023 జనవరి 27 కావడంతో పిటిషనర్ 2021-22 ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు ఎలాంటి మినహాయింపును ఇవ్వలేమని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులను న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. దీంతో హైకోర్టు అప్పీలును కొట్టివేస్తూ నోటిఫికేషన్ ప్రకారం 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

బీఆర్​ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి - రేషన్ కార్డులపై ప్రజలు తిరగబడటం ఖాయమన్న కేటీఆర్

కేటీఆర్​కు హైకోర్టులో ఊరట - న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.