Brother In Law Murder In Sangareddy : మతిస్థిమితం లేని బావ పేరు మీద బావమరిది జేసీబీని కొనుగోలు చేశాడు. అలాగే బావ పేరు మీద పోస్టల్ బీమా కూడా చేయించాడు. బావను హత్య చేస్తే బీమా డబ్బులు వస్తాయని, జేసీబీ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుందని పన్నాగం పన్ని స్నేహితుడితో కలిసి సొంత బావనే హత్య చేశాడు. ఆ తర్వాత సాధారణ మృతి కింద నమ్మించే యత్నం చేశాడు. పోలీసులు అనుమానం వచ్చి లోతుగా విచారించడంతో అసలు బండారం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్ల తండాకు చెందిన గోపాల్ నాయక్ (42) తన కుటుంబంతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసముంటున్నాడు. గోపాల్‌నాయక్‌కు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. అయితే శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గోపాల్ నాయక్ కనిపించడం లేదని వెతుకుతుండగా అమీన్‌పూర్‌లోని శ్మశాన వాటిక వద్ద చనిపోయి ఉన్నాడు. దీంతో అతని కుమారుడు సుధీర్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్మశాన వాటిక వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై గాయాలు ఏం లేకపోయినప్పటికీ, మృతుని బామ్మర్ది నరేశ్‌పై అనుమానం రావడంతో పోలీసులు విచారించారు.
బావను హత్య చేసిన బామ్మర్ధి : విచారణలో హత్య చేసింది బామ్మర్ది నరేశ్ నాయక్ అని తేలింది. నరేశ్ గతంలో బావ గోపాల్ నాయక్ పేరు మీద జేసీబీ కొనుగోలు చేశాడు. అలాగే మూడు నెలల క్రితం బావ పేరు మీద దాదాపు రూ.25 లక్షల ఎల్ఐసీ బీమా తీసుకున్నాడు. బావను హత్య చేస్తే ఎల్ఐసీ డబ్బులతో పాటు జేసీబీ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుందన్న ఆలోచనతో హత్య చేయాలనుకున్నాడు. పథకం ప్రకారం శుక్రవారం బావ గోపాల్ నాయక్‌ను అమీన్పూర్ శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి స్నేహితునితో కలిసి గొంతు నులిమి హత్య చేశాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసిన యువకుడు
మీర్‌పేట హత్య కేసులో కీలక పరిణామం - ఎఫ్ఐఆర్లో మరో ముగ్గురి పేర్లు!