Benefits Of Eating Vegetarian Food : ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో సాత్విక ఆహారం వైపు మళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు, మరికొందరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో శాకాహారం బాట పడుతున్నారు. అనేక ప్రయోజనాలున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చనేది నిపుణుల సూచన. కొంతమంది వారంలో ఒకటి, రెండు రోజులు దీన్ని పాటిస్తుండగా, మరికొందరు మొత్తం దూరంగా ఉంటుండటం విశేషం.
పదేళ్ల కిందట ఆపేసి : సిద్దిపేట ప్రాంతానికి చెందిన భూపతిరాజు 40 ఏళ్ల వయసు వచ్చే వరకు మాంసాహారం తిన్నారు. 2014లో ధ్యాన సాధన చేయడం ప్రారంభించడంతో పూర్తిగా శాకాహారిగా మారారు. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఏచోట శాకాహారంపై ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించినా పాల్గొంటున్నారు. ఆసక్తి ఉన్నవారికి తన వంతుగా ప్రేరణ కల్పిస్తున్నారు. ఆయా అంశాలపై తరగతులను నిర్వహిస్తున్నారు.

మార్పు తథ్యం :
- మానసిక దృఢత్వంతో పాటు పరివర్తన పొందుతారు. పలు అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఉద్రేకం, కోపం తగ్గి మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటారు.
- మాంసాహారం భోజనం చేశాక జీర్ణం కావాలంటే 72 గంటల సమయం పడుతుంది. కూరగాయలు, ఆకు కూరలకైతే 24 గంటల సమయం సరిపోతుంది.
- చిక్కుడు జాతిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే ప్రొటీన్లతో పాటు బి-విటమిన్, ఫైబర్లు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.
- సోయాబీన్స్‌లో మాంసాహారానికి సమానమైన ప్రొటీన్లు లభిస్తాయి.
- బరువు తగ్గాలనుకునే వారు శాకాహారం తీసుకోవడమే మేలన్నది నిపుణుల మాట. పచ్చని ఆకుకూరలతో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
చిన్నతనంలోనే మాంసాహారం తినడం మానేశా : తాండూరు ప్రాంతానికి చెందిన శారదాగౌడ్, నరహరి గౌడ్ దంపతులకు ముగ్గురు సంతానం. శారద ఆరేళ్ల వయసులోనే మాంసం తినొద్దని నిర్ణయించుకొని ఇప్పటికీ పాటిస్తున్నారు. పెళ్లయ్యాక ఆమె భర్త నరహరి సైతం ఆమె నిర్ణయానికి గౌరవం ఇచ్చారు. ఈయన ఆర్మీలో ఉద్యోగం చేసి రెండు ఏళ్ల కింద విరమణ పొందారు. అక్కడి నుంచి వచ్చాక తాను కూడా ఇదే బాటలో(శాకాహారం) నడుస్తున్నారు. నెలలో ఒక్కసారి మాత్రమే బయట భుజిస్తారు. కాగా ఇంట్లో మాత్రం దాని జోలికి వెళ్లరు.
సూర్యారాధనతో : సెలవు రోజైన ఆదివారం మాంసాహారం తినే వారే అధికంగా ఉంటారు. సూర్యారాధన చేసే వారు మాత్రం ఇందుకు వ్యతిరేకం. రామాయంపేట ప్రాంతానికి చెందిన వ్యాపారి రమేశ్ రెండేళ్లుగా దీన్ని పక్కాగా పాటిస్తున్నారు. వారంలో మిగతా రోజుల్లో మాంసం తింటారు కానీ ఆదివారం మాత్రం దూరంగా ఉంటారు. 2 ఏళ్లుగా సూర్యుడిని ఆరాధిస్తున్నారు. ఈయన బాటలోనే పట్టణానికి చెందిన మరో 4 పయనిస్తున్నారు.
దంపతులిద్దరూ కలిసి : గుమ్మడిదలకు చెందిన పడమటి లక్ష్మారెడ్డి, బాలమణి దంపతుల భోజనంలో నాన్‌వెజ్ తప్పక ఉండి తీరాల్సిందే. ఇది మొన్నటివరకు కాగా, ఇప్పుడు మాంసాహారానికి పూర్తిగా దూరం. 2023లో స్థానికంగా కల్యాణ రామచంద్రస్వామి ఆలయం పనులు ప్రారంభించగా, ఆ సమయంలోనే దంపతులిద్దరూ మాంసాహారం ముట్టకూడదని నిర్ణయించుకొని శాకాహారులుగా మారిపోయారు. నిత్యం కూరగాయలను, పండ్లు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటున్నామని చెబుతున్నారు వారు.
వారంలో రెండు రోజులు : జహీరాబాద్ ఆర్యనగర్‌కు చెందిన 30 ఏళ్ల ప్రేమ్‌కుమార్ బీటెక్ పూర్తిచేసి ప్రైవేటు పనులను చేస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు మాంసాహారం నిత్యం తినేవారు. ఆ సమయంలో వారంలో 2 రోజులు మానేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి బుధ, గురువారాల్లో మాంసాహారం తీసుకోరు. ఇది తన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా మారిందని చెబుతున్నాడీ యువకుడు.
Vegetarian Tips Protein : వెజిటేరియన్ డైట్ పాటిస్తున్నారా? పోషకాలన్నీ అందాలంటే ఎలా?