Telangana Hopes on Union Budget Announces : ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో రైల్వేకు చేసే కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న కొత్త రైల్వే మార్గాలు, రైళ్లు, అదనంగా లైన్ల నిర్మాణానికి రూ.83,543 కోట్లు అవసరం అవుతుంది. ఇవి కాకుండా మరిన్ని రైళ్లు, ప్రాజెక్టులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే కోరుకుంటోంది. బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది.
ఇప్పటివరకూ అనుసంధానం లేని 9 జిల్లా కేంద్రాలకు రైలు మార్గం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులూ కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ప్రజలు ఏటా పెద్ద సంఖ్యలో వెళ్లే భద్రాచలం, రామప్ప, మేడారం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు జిల్లా కేంద్రాలైన వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, నిర్మల్, భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాలకు రైలు మార్గమే లేదు.
ఇవి ప్రతిపాదనలు :
- హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
- హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు వేయడానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. దీన్ని సొంతంగా చేపడతామని కేంద్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అయినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
- హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లేందుకు ఇప్పుడున్న ఒకే ఒక రైలు తమిళనాడు, కేరళ మీదుగా సుదూర మార్గంలో నడుస్తోంది. అది కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు, కుక్కే సుబ్రహ్మణ్య స్టేషన్ల మీదుగా మంగళూరుకు సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభిస్తే ప్రయాణ దూరం, సమయం తగ్గుతుంది.
- కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగు రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగు రైల్వే లైన్ నిర్మిస్తామని గతంలోనే కేంద్రం తెలిపింది. ఇందుకు రూ.12,408 కోట్లు కావాలని ప్రాథమికంగా అంచనా.
- సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గంలో మూడో లైన్ నిర్మాణానికి 2014లో సర్వేకు అనుమతిస్తే 2018లో రైల్వే బోర్డుకు సర్వే నివేదికను ఇచ్చారు. ఇంకా లైను నిర్మాణం పూర్తి కానేలేదు.
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు గతేడాది రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీని సర్వే ఏడాదిగా జరుగుతోంది.
- హసన్‌పర్తి నుంచి భూపాలపల్లికి రైలు మార్గం పెండింగ్‌లో ఉంది. మణుగూరు నుంచి మేడారం మీదుగా రామగుండం వరకూ కొత్త మార్గం కోసం దశాబ్దాలుగా అటవీ ప్రాంత గ్రామాల వాసులు ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇంకా అవ్వలేదు.
- కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 62 కి.మీ. దూరం కొత్త ట్రాక్ నిర్మాణానికి 2011లోనే సర్వే మంజూరై రూ.464 కోట్లు కావాలని అంచనా. ఇప్పటికే దీని అంచనా వ్యయం రూ.1,116 కోట్లు దాటినా పనులు కావడం లేదు.
- వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకూ 122 కిలోమీట్ల రైలు మార్గం నిర్మాణానికి 2010 జూన్‌లో సర్వేకు అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.787 కోట్లు కావాలని అంచనా నివేదికను 2012లోనే రైల్వే బోర్డుకు ఇచ్చారు. ఇప్పుడు దీని అంచనా వ్యయం రూ.2,196 కోట్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
New Railway Projects to Telangana: తెలంగాణకు మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు