Top 5 Financial Tips : జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనకు మనమే అనేక నియమాలు పెట్టుకుంటాం. కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను పాటిస్తాం. ఎంత తినాలి? ఏ టైమ్‌లో తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొవాలి? ఇలాంటి నియమాలు మనలో క్రమశిక్షణను అలవరుస్తాయి. అలాగే డబ్బు విషయంలోనూ నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ మదుపు చేయాలి? వంటి విషయాల్లో కొన్ని నియమాలు పాటిస్తేనే ఆర్థికంగా విజయం సాధిస్తాం. అందుకోసం ఆర్థిక నిపుణులు 5 మనీ రూల్స్ సూచించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. ఆదాయం కంటే తక్కువ వ్యయం
మీ ఖర్చులు మీ సంపాదనను ఎప్పుడూ మించొద్దు. అంటే మీ సంపాదన కంటే మీరు తక్కువ ఖర్చు చేయాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో రూ.15వేలు లేదా రూ.18వేలు మాత్రమే ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన మొత్తాన్ని మీ భవిష్యత్తు కోసం ఆదా చేసుకోండి. లేదంటే ఇతర మాధ్యమాల్లో పెట్టుబడులు పెట్టండి.
మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే మీకు ఎల్లప్పుడూ డబ్బు కొరతగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో రుణాలు, క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సి రావొచ్చు. మీ ఆదాయం కన్నా తక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. దీంతో ఎటువంటి ఆర్థిక ఒత్తిడి ఉండదు.
2. పొదుపు, పెట్టుబడి
మీ సంపాదనలో కొంత మొత్తం ఆదా చేయండి. ఉదాహరణకు, మీరు నెలకు రూ.30,000 సంపాదిస్తున్నారనుకుందాం. అందులో రూ.3వేలు - రూ.5వేలు వరకు ఆదా చేయడానికి ప్రయత్నించండి. ఆ మొత్తాన్ని దీర్ఘకాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టండి.
3. అత్యవసర నిధి
మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇంటి రిపేర్లు వంటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. మీరు 3-6 నెలల వరకు ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.20,000 అయితే, అత్యవసర నిధిలో రూ.60వేలు -రూ.1,20,000 వరకు సేవ్ చేయండి. ఈ డబ్బును సులభంగా యాక్సెస్ చేసుకోగల సేవింగ్స్ ఖాతాలో జమ చేయండి. దీంతో మీకు అవసరం అయినప్పుడు ఎమర్సెన్సీ ఫండ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫండ్ కష్ట సమయాల్లో ఆర్థికంగా మీకు సాయపడుతుంది.
4. ఆదాయ మార్గాలు
ఒకే ఉద్యోగం లేదా ఆదాయ వనరుపై ఆధారపడకుండా డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలను అన్వేషించండి. దీంతో ఒక ఆదాయం ఆగిపోయినా లేదా తగ్గినా, వేరే ఇన్ కమ్ వస్తుంది.
ఉదాహరణకు మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు జాబ్ చేస్తున్నారనుకుందాం. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అలాగే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటివి చేయవచ్చు. విభిన్న ఆదాయ వనరులను కలిగి ఉండటం ద్వారా మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆర్థికంగా స్థిరంగా ఉండవచ్చు.
5. అధిక వడ్డీ రుణాలు
ఆర్థిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే అధిక వడ్డీ రేటుతో రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకోకపోవడం మంచిది. అధిక వడ్డీతో లోన్లు తీసుకున్నా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఉదాహరణకు, మీరు 20 శాతం వడ్డీ రేటుతో క్రెడిట్ కార్డును ఉపయోగించారనుకుందాం. అప్పుడు క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో, త్వరగా చెల్లించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం కూడా ఉంది. అందుకే మీకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకండి. అలాగే వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డు బిల్లులను కట్టేయండి. అప్పుడు మీరు ఆర్థిక చాలా సురక్షితంగా ఉండగలుగుతారు.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
RBI 15డేస్ రూల్- మీ క్రెడిట్ స్కోర్‌పై పడే ప్రభావం ఇదే! ఇకపై అలా చేయడం కష్టం!
స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌పై 65శాతం డిస్కౌంట్! అమెజాన్ స్పెషల్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!!