Acne on Back : ముఖం మీద మొటిమలతో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే, వీపు మీద మొటిమలతో కూడా కొందరు అవస్థ పడుతుంటారు. మరి, ఈ పరిస్థితికి కారణమేంటి? అసలు వీపు మీద మొటిమలు, కురుపులు రావడమేంటి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా సూచిస్తున్నారు.
బయట తిరిగి వచ్చిన వారు, అలాగే వర్కవుట్స్ పూర్తి చేసిన వారు వెంటనే స్నానం చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వెంటనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. స్నానం వల్ల చెమట పూర్తిగా తొలగిపోయి, పొక్కులు ఏర్పడకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు.
వీపు సరిగా రుద్దుకోకపోయినా సమస్య వస్తుంది. చాలా మందికి వీపు సరిగా అందదు. దీంతో పైపైన క్లీన్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన జిడ్డుదనం, మురికి కారణంగా పొక్కులు, మొటిమల సమస్య తలెత్తుతుంది. అందువల్ల వీపును చక్కగా స్క్రబ్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మీ చర్మతత్వాన్ని బట్టి స్క్రబ్బర్‌ను ఎంచుకోవాలని చెబుతున్నారు.
ఆయిల్‌తో మసాజ్ :
టీట్రీ ఆయిల్ తో మర్దనా చేసుకోవడం వల్ల పలు రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. అందువల్ల తరచూ వీపును మసాజ్ చేసుకోవాలి. అదేవిధంగా టీట్రీ ఆయిల్ తో తయారైన లోషన్స్, క్లెన్సర్స్, క్రీములు వాడినా ఫలితం బాగుంటుందని సూచిస్తున్నారు.
సన్ స్క్రీన్ :
ఎక్కువ మంది ముఖానికి మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. కానీ.. వీపుకీ ఇది అవసరమేనట. కాలుష్యం, దుమ్ము కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలను ఇది తెరిచేలా చేస్తుందని చెబుతున్నారు. తద్వారా చర్మ కణాలు శుభ్రపడతాయని, మొటిమల సమస్య ఉండదని అంటున్నారు. అయితే, ఆయిల్ లేని సన్‌స్క్రీన్ లోషన్స్ సెలక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వీపుపై కురుపులు, మొటిమలు పెరగడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా కారణమవుతుందట. అందువల్ల GI తక్కువగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు, ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మహిళల్లో లూజ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. చూడ్డానికి బాగుంటుంది కానీ, దీనివల్ల కూడా వీపు మీద మొటిమలు వచ్చే ఛాన్స్ ఎక్కువట. జుట్టు వెంట్రుకల్లో ఉండే ఆయిల్స్ వీపు చర్మానికి అంటుకోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జుట్టు విరబోసుకోకుండా పోనీ టెయిల్, ఆయిల్ పెట్టుకున్నప్పుడు బన్ హెయిర్‌స్టైల్ వంటివి ఎంచుకోవడం మంచిదని అంటున్నారు.
వీటితోపాటు మెంటల్ ప్రెజర్ వల్ల కూడా వీపు మీద మొటిమలు రావొచ్చట. ఆందోళన కారణంగా శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఫలితంగా వీపు మీద కురుపులు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇన్ని చేసినా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Conclusion: