Kanuma Festival Significance : నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ. ప్రకృతిని దైవంగా భావించి పూజించే కనుమ పండుగ ప్రధానంగా కర్షకుల పండుగ. ఈ సందర్భంగా కనుమ పండుగ విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాడిపంటలు పండుగ
మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజున కనుమ పండుగగా జరుపుకుంటాము. కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ. ఈ రోజున పాడి పంటలను, పశుసంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం.
సంప్రదాయ రీతిలో కనుమ
కనుమ పండుగ రోజు కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటు స్నానం చేయాలి. శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి.
ఆడపడుచులకు పసుపుకుంకుమలు
కనుమ పండుగ రోజున ఆడపడుచులకు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు. అంటే మినపప్పుతో చేసిన గారెలు వంటివి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలంలో మినప గారెలు తినడం ఆరోగ్యానికి మంచిది. నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది.
పశువుల పండుగ
కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి, పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి, వాటి మెడలో రంగురంగుల పూసలు, గంటలు కట్టి అలంకరిస్తారు.
అలరించే గంగిరెద్దుల వారు
కనుమ రోజు గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లూ తిరుగుతూ గంగిరెద్దు చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం, వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్లు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం.
దేవుళ్ల వనవిహారం
కనుమ రోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తోటలలోనికి తీసుకువెళ్తారు. ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాలలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది.
శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం కనుమ రోజున ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం. కనుక సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, జానపదుల పండుగ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ కనుమ మానవులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా పండుగే.
పశువులలో సైతం దివ్యత్వం
జంతు జాలంలో సైతం దివ్యత్వాన్ని చూసి పూజించే పండుగ ఈ కనుమ పండుగ. ఈ పండుగ రోజులలో పెద్దలు, పిల్లలంతా కలిసి గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. అందరూ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గు వేస్తారు. ఈ రోజు దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది.
తప్పకుండా పాటించాల్సినవి
కనుమ రోజు ఊరి పొలిమేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే పండక్కి ఊరెళ్ళిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.
ఇలా సాంప్రదాయ బద్దంగా కనుమ పండుగ జరుపుకోవడం వల్ల సిరిసంపదలు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. రానున్న కనుమ పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు పశు పక్ష్యాదులకు గౌరవిస్తూ పూజించే ఈ పండుగ మనకు ఎంతో ఆనందాన్ని సకల సౌభాగ్యాలను, శుభములను ఇవ్వాలని కోరుకుంటూ ప్రకృతి స్వరూపిణి అయినా ఆ అమ్మను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.