RBI Credit Score Update Rules : వ్యక్తిగత రుణాల మంజూరు ఇకపై అంత సులభం కాదు. ఎందుకంటే వాటికి సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠినతరం చేసింది. క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు త్వరితగతిన అప్‌డేట్ చేయాల్సిందే అని క్రెడిట్ స్కోర్ బ్యూరోలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ రూపొందించిన కొత్త గైడ్‌లైన్స్ జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిలోని ముఖ్యమైన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కీలక మార్పులు
క్రెడిట్ స్కోరు/క్రెడిట్ రిపోర్ట్ అనేది రుణాలు పొందడంలో మనకు చాలా కీలకమైంది. అయితే క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేసేందుకు క్రెడిట్ బ్యూరోలు ఇంతకుముందు గరిష్ఠంగా 30 నుంచి 45 రోజుల సమయాన్ని తీసుకునేవి. ఆ గడువును ఆర్‌బీఐ బాగా తగ్గించింది. గరిష్ఠంగా 15 రోజుల్లోగా క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేయాలని నిర్దేశించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ అంశంపై శ్రద్ధపెట్టాల్సి ఉంటుంది. తమ వినియోగదారులకు సంబంధించిన క్రెడిట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోలకు పంపాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రెడిట్ బ్యూరోలు తమతమ యాప్‌లు, పోర్టల్స్‌లో ఖాతాదారులు/రుణగ్రహీతలు/వినియోగదారుల క్రెడిట్ రిపోర్టులను అప్‌డేట్ చేస్తాయి. దీంతోపాటు ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకటికి మించి వ్యక్తిగత రుణాలను పొందడం అనేది కష్టతరం అయ్యేలా నిబంధనలను ఆర్‌బీఐ మార్చింది.
క్రెడిట్ రిపోర్ట్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి?
క్రెడిట్ రిపోర్టు అప్‌డేట్ కావడం ఆలస్యమైతే, మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన వారికి సకాలంలో రుణాలు దొరకకపోవచ్చు. నెగెటివ్ ట్రాక్ రికార్డ్ కలిగిన వారికి వెంటనే రుణాలు మంజూరై పోవచ్చు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే క్రెడిట్ రిపోర్టు అప్‌డేటెడ్‌గా ఉండటం చాలా కీలకం. రుణాలకు దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు క్రెడిట్ రిపోర్టే ప్రామాణికంగా నిలుస్తుంటుంది.
వ్యక్తిగత రుణాలపై పడే ప్రభావం ఎంత ?
ఒక వ్యక్తి ఒకేసారి ఒకటికి మించి రుణాల కోసం దరఖాస్తు చేయడం కష్టతరం అయ్యేలా ఆర్‌బీఐ నూతన నిబంధనలు ఉన్నాయి. ప్రతీ 15 రోజులకు క్రెడిట్ రిపోర్టు అప్‌డేట్ అయిపోతుంటుంది. దాని ఆధారంగా దరఖాస్తుదారుడి ఆర్థిక పరపతి, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవగాహనకు వస్తాయి. ఒకేసారి ఒకటికి మించిన చోట్లలో రుణాలు మంజూరుకావు.
ధరఖాస్తును తిరస్కరిస్తే కచ్చితంగా చెప్పాల్సిందే!
కొంతమందికి సంబంధించిన క్రెడిట్ రిపోర్టుల్లో పలు అంశాలు తప్పుగా ప్రచురితం అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తమ క్రెడిట్ రిపోర్టుల్లో దిద్దుబాట్లు చేసి, సవరణలు చేయాలని సంబంధిత కస్టమర్లు బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు దరఖాస్తు చేస్తుంటారు. ఇలా దరఖాస్తులను అందుకున్నాక బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వాటిని నిశితంగా పరిశీలిస్తాయి. దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాలు వాస్తవికమైనవే అని తేలితే, క్రెడిట్ రిపోర్టుల్లోవాటిని సవరించాలని క్రెడిట్ బ్యూరోలకు నివేదికను పంపుతాయి. కొన్నిసార్లు ఈ దరఖాస్తులను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తిరస్కరిస్తుంటాయి. ఇకపై ఇలా తిరస్కరించి వదిలేస్తే కుదరదు. దరఖాస్తును ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని కస్టమర్‌కు స్పష్టంగా తెలియజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనివల్ల బ్యాంకుల ఖాతాదారులు, రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం దక్కుతుంది.
2024 ఆగస్టులో సమాచారం
కస్టమర్లకు జవాబుదారీగా ఉండేలా అవి తమ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ నూతన నిబంధనలపై 2024 ఆగస్టులోనే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, క్రెడిట్ బ్యూరోలకు ఆర్‌బీఐ సమాచారాన్ని అందించింది. వాటిని ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అంటే నూతన నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు తమ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు తగినంత సమయాన్ని ఇచ్చింది. మొత్తం మీద వాటి వల్ల అర్హులైన వారికి తప్పకుండా రుణాలు మంజూరవుతాయి.
ఒక క్రెడిట్ కార్డ్‌తో మరో క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? ఈ 3 మెథడ్స్ ఫాలో అవ్వండి!
పూచీకత్తు లేకుండా రూ.20కోట్ల వరకు బిజినెస్ లోన్ - ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?