Safety Tips For OTP Detection :సైబర్ మోసగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని అపహరించి మోసం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. బ్యాంకులు, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, కొరియర్ సంస్థల పేర్ల సాయంతో ఓటీపీలను చెప్పాలని అడుగుతూ మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తుంటారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలి కాలంలో కొరియర్ డెలివరీల పేరు చెప్పి, ఆర్థికంగా మనల్ని మోసం చేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. మరి వీటిపట్ల అలర్ట్‌గా ఉండేందుకు ఈ కింది టిప్స్‌ను ఫాలో అవ్వండి.
- ఒక ఫోన్‌కాల్ లేదా మెసేజ్ వచ్చి, ఆర్థిక విషయాల గురించి అవతలి నుంచి సంభాషణ జరుగుతుంటే ఒక్కసారి ఆలోచించాలి.
- బ్యాంకులు, బీమా సంస్థలు, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, ఇతర ఆర్థిక సంస్థలు ఏవైనా సరే మీనుంచి ఓటీపీని ఎప్పుడూ అడగవు.
- కొరియర్‌లో వచ్చిన వస్తువులను మనకు ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి ఓటీపీని పంపించాం, చెప్పండి అని అడుగుతారు. అంతేకానీ, ఫోన్‌లోనే ఓటీపీలను అడగరు అని గుర్తుంచుకోండి.
మీకు ఏదైనా ఓటీపీ వచ్చిన వెంటనే మీకు రావాల్సిన సందేహాలివే!
ఈ అంశాలను చెక్ చేయండి
ఓటీపీకి సంబంధించిన లావాదేవీని స్వయంగా మీరే నిర్వహించారా? ఓటీపీ విశ్వసనీయ సంస్థ నుంచే వచ్చిందా? మెసేజ్‌లో ఏదైనా ఒత్తిడి, అత్యవసరం అని కనిపిస్తోందా? అనే అంశాలను చూసుకోండి.
భాషను పరిశీలించండి
ఆయా ఫోన్‌కాల్ లేదా మెసేజ్‌లో వాడిన భాషను నిశితంగా పరిశీలించండి. మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే ఓటీపీ వచ్చిందంటే అది కచ్చితంగా మోసపూరితమేనని గుర్తుంచుకోండి.
ఆ సమయంలో స్పందించకండి
బ్యాంకు, బీమా సంస్థల నుంచి ఫోన్ చేసి ఇ-కేవైసీ కోసం మీ వ్యక్తిగత వివరాలు కావాలి అని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని తెలియజేయండి.
అఫీషియల్ వాటిని సంప్రదిస్తే మేలు
సంబంధిత సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్లు, వినియోగదారుల సేవా కేంద్రాలను సంప్రదించి అవసరమైన సేవలను పొందడం ఉత్తమం.