Telangana High Court Judgement On Stolen Gold : చోరీకి గురైన బంగారు నగలను, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద కాకుండా సెక్షన్ 102లో పేర్కొన్న విధంగా వాటిని సీజ్ చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. దొంగతనం కేసుల్లోని బంగారు నగలను స్వాధీనం చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ 2021 నుంచి దాదాపు 16 పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై ఇటీవల జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పలు వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరించారు.
న్యాయవాదుల వాదనలు : పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించుకుని రుణం మంజూరు చేస్తామని, పోలీసులు తరచూ వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ, పిటిషన్ విచారణార్హం కాదని అన్నారు. ఒకవేళ ఈ కోర్టు ఏవైనా ఉత్తర్వులు జారీ చేసినట్లయితే దర్యాప్తునకు అడ్డంకిగా మారుతుందని తెలిపారు.
మణప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు : ఇద్దరి వాదనలను విన్న న్యాయమూర్తి చోరీ సొత్తును సీజ్ చేసే అధికారం సీఆర్‌పీసీ సెక్షన్ 102 (బీఎన్‌ఎస్ 106) ప్రకారం పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. కేసు పూర్వాపరాల ఆధారంగా దొంగతనంతో సంబంధం లేదని నిరూపిస్తే తప్ప, హైకోర్టు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. మణప్పురం కంపెనీ సీఆర్‌పీసీ సెక్షన్ 451, 457ల కింద కింది కోర్టును ఆశ్రయించవచ్చని, దానిపై చట్ట ప్రకారం మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. పోలీసు నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
తెలియని వారిని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా? - అయితే వారిపై ఓ కన్నేయండి