Rupee Hit Record Low : చరిత్రలో అత్యంత కనిష్ఠానికి రూపాయి విలువ పడిపోయింది. సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే 58పైసలు తగ్గి రూ.86.62 వద్ద చరిత్రలోనే కనిష్ఠానికి చేరుకుంది. దాదాపు రెండేళ్లలో ఒకేసారి 58 పైసల వరకు పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికన్ డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం రూపాయి పతనానికి దారితీసింది.
సోమవారం ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజిలో రూ.86.12 రూపాయి వద్ద ప్రారంభమైంది ట్రేడింగ్. మిడ్-సెషన్లో డాలర్‌తో పోలిస్తే 58 పైసల నష్టంతో 86.62 వద్ద అత్యల్ప స్థాయికి పడిపోయింది. చివరిసారిగా 2023 సంవత్సరం ఫిబ్రవరి 6న రూపాయి విలువ అత్యధికంగా 68 పైసలు మేర తగ్గింది. ఇక 2024 డిసెంబరు 30న డాలరుతో రూపాయి మారకం విలువ రూ.85.52కు చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వారాల వ్యవధిలో దాదాపు 1 రూపాయి మేర విలువను భారత కరెన్సీ కోల్పోయింది.
ఈ పరిణామంతో భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని పరిశీలకులు తెలిపారు. గత శుక్రవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) రూ.2,254.68 కోట్లు విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. మొత్తం మీద జనవరి నెలలో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు మొత్తం రూ.22,194 కోట్లు విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.
రంగంలోకి దిగనున్న ఆర్‌బీఐ
రూపాయి క్రమంగా బలహీనపడుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలోనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించే అవకాశం ఉంది. రూపాయి మారకం విలువను స్థిరంగా ఉంచే దిశగా తమ నిర్ణయాల్లో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. రూపాయి డీలాపడుతున్న వేళ గత శుక్రవారం కీలక గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. జనవరి 3తో ముగిసిన వారం నాటికి భారతదేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు 5.693 బిలియన్ డాలర్లు మేర తగ్గి 634.585 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2024 నవంబరులో భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 5.2 శాతం మేర పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పండుగల సీజన్ సందర్భంగా వ్యాపారాలు ఊపందుకోవడం, తయారీ రంగం వేగం పుంజుకోవడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.
'మోదీ వయసు కంటే వేగంగా రూపాయి పతనం!'
రూపాయి విలువ పతనంపై ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన వయసు కంటే రూపాయి విలువ వేగంగా పడిపోతోందని ఎద్దేవా చేసింది. 'మోదీ ప్రధాని అయినప్పుడు ఆయన వయసు 64ఏళ్లు. అప్పుడు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.58.58గా ఉంది. ఆ సమయంలో రూపాయి విలువను బలోపేతం చేస్తామని ప్రగల్బాలు పలికారు. రూపాయి విలువను ఆయన ముందు ప్రధాని వయసుతో పోల్చి ఎగతాళి చేశారు. అది సరే, ప్రధానికి ఈ ఏడాది చివర్లో 75ఏళ్లు నిండుతాయి. ఈ తరుణంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.86 దాటిపోయింది. దీంతో మోదీ తన పతన పతాకాన్ని ఆయనే ఎగురవేస్తున్నారని స్పష్టం అవుతోంది' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్