How to Make Allam Nilva Pachadi: టిఫెన్స్లో తినడానికి ఇష్టపడే చట్నీలలో అల్లం చట్నీ ఒకటి. పల్లీ చట్నీ మాదిరిగానే దీనికి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా హోటల్స్‌లో దీనిని సర్వ్ చేస్తుంటారు. అయితే అల్లం చట్నీ అంటే కేవలం టిఫెన్స్లోకి మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ కేవలం చట్నీలకు మాత్రమే కాకుండా అన్నం, చపాతీల్లోకి కూడా ఈ పచ్చడిని తినవచ్చు. ఎందుకంటే దీని రుచి చాలా బాగుంటుంది. అయితే పర్ఫెక్ట్ రుచి రావాలంటే పక్కా కొలతలతో మాత్రమే పెట్టాలి. అలా పెట్టాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. కేవలం నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన, నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- అల్లం - ముప్పావు కప్పు 100 గ్రాములు
- చింతపండు - ముప్పావు కప్పు 100 గ్రాములు
- బెల్లం - ముప్పావు కప్పు 100 గ్రాములు
- మెంతులు - 1 టీ స్పూన్
- ఆవాలు - 2 టీ స్పూన్లు
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాలు -2 టీ స్పూన్లు
- ఉప్పు - 40 గ్రాములు
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 10
- నూనె - కప్పు
- కారం - అర కప్పు(60 గ్రాములు)
తాలింపు కోసం:
- పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- మినపప్పు - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 15
- ఎండు మిర్చి -5
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - పావు టీ స్పూన్
తయారీ విధానం:
- అల్లం పొట్టు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి.
- చింతపండులో కూడా గింజలు, పీచు, పొట్టు లేకుండా శుభ్రంగా తీసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టాలి.
- గిన్నెలోకి చింతపండను తీసుకుని ఓ రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఏ కప్పుతోటైతే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో డబుల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ముప్పావు కప్పు చింతపండు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పుల నీరు తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి ఈ చింతపండు గిన్నెను పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ చింతపండు ఉడికి దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి. చింతపండు ఉడికి గుజ్జుగా మారినప్పుడు తీసి పక్కన పెట్టాలి.
- అదే స్టవ్ మీద మరో పాన్ పెట్టి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి మంచి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోండి.
- అదే పాన్‌లో రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసి కాస్త రంగు మారేంతవరకు వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- మిక్సీ జార్‌లోకి వేయించిన మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి వేయించిన అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఓ సారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోకి బెల్లం తురుము వేసి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి.
- మళ్లీ మిక్సీ గిన్నెలోకి ఉడికించిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి అల్లం ముక్కలు వేయించిన పాన్ పెట్టి పావు కప్పు నూనె తీసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. చింతపండులోని గుజ్జు మొత్తం ఉడికి దగ్గర పడిన తర్వాత ఈ పాన్‌ను పక్కన ఉంచాలి.
- ఇప్పుడే అదే స్టవ్‌పై మరోపాన్ పెట్టి మిగిలిన నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు గింజలను మంచిగా ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు గింజలు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు క్రిస్పీగా వేగాలి. చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- తాలింపు చల్లారిన తర్వాత ముందే గ్రైండ్ చేసిన మెంతులు, ఆవాల పొడి, అల్లం గుజ్జు, కారం, ఉడికించిన చింతపండు గుజ్జు వేసి అన్ని కలిసేలా బాగా కలపాలి.
- ఇలా అన్నింటిని కలిపిన తర్వాత ఓ సారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
- ఇలా కలిపిన మిశ్రమాన్ని ఓ గాజు జార్లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అల్లం నిల్వ పచ్చడి రెడీ. నచ్చితే మీరూ చేసేయండి.
ఇంట్లోనే అద్దిరిపోయే హోటల్ స్టైల్ అల్లం చాయ్ - చాలా మందికి ఈ టిప్స్ తెలియదు!
ఆరోగ్యాన్నిచ్చే "అల్లం పెరుగు పచ్చడి" - సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!