Simple Tomato Pachadi Recipe : చాలా మంది ఇష్టంగా తినే పచ్చళ్లలో టమాటా పచ్చడి ముందు వరుసలో ఉంటుంది. ఈ పచ్చడిని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడైనా టమాటాలను ఉడకబెట్టకుండా పచ్చడిని ట్రై చేశారా? లేదు అంటే ఒకసారి తప్పక టేస్ట్ చేయాల్సిందే. ఎన్నడూ తినని టేస్ట్‌తో వహ్వా అనిపిస్తుంది. బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ చట్నీ అన్నంతో పాటు టిఫెన్స్లోకీ అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- అర కిలో - టమాటాలు
- 12 - వెల్లుల్లి రెబ్బలు
- నిమ్మకాయ సైజంత - చింతపండు
- తగినంత - కారం
- పావు టీస్పూన్ - వేయించిన మెంతుల పొడి
- పావు టీస్పూన్ - వేయించిన ఆవాల పొడి
- రుచికి సరిపడా - దొడ్డు ఉప్పు
తాలింపు కోసం :
- ముప్పావు కప్పు - ఆయిల్
- 1 టీస్పూన్ - ఆవాలు
- 1 టీస్పూన్ - జీలకర్ర
- 1 టీస్పూన్ - మినప పప్పు
- 1 టీస్పూన్ - శనగపప్పు
- 10 - వెల్లుల్లి రెబ్బలు
- 6 - ఎండుమిర్చి
- 3 రెమ్మలు - కరివేపాకు
- పావు టీస్పూన్ - ఇంగువ
- అరటీస్పూన్ - పసుపు
ఎప్పుడూ తినని రుచితో కమ్మని "ఉల్లిపాయ పచ్చడి" - అన్నం, టిఫెన్స్లోకి సూపర్ కాంబో!
తయారీ విధానం :
- ముందుగా టమాటాలను తొడిమె భాగం తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటా ముక్కలు, చింతపండుని రెమ్మలుగా విడదీసుకొని వేసుకోవాలి. అలాగే కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- ఆవాలు చిటపటమనే వరకు వేయించుకున్నాక అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి తాలింపుని చక్కగా వేపుకోవాలి.
- పోపు మంచిగా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకునేటప్పుడే అందులో వేయించిన మెంతుల పొడి, ఆవాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకోవడం ద్వారా పచ్చడికి మంచి ఫ్లేవర్, రుచి వస్తుంది. అలాగే, పచ్చడిని ఉడికించుకునే క్రమంలో ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోవచ్చు.
- పచ్చడిలో నూనె సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపి చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత ఏదైనా గాలి చొరబడని గాజు కంటైనర్ లేదా జాడీలో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "టమాటా పచ్చడి" రెడీ!
- ఈ పచ్చడిని మామూలుగా స్టోర్ చేసుకుంటే కనీసం వారం పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు 20 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది!
తెలంగాణ స్టైల్ "రేగుపండ్ల నిల్వ పచ్చడి" - ఒక్కసారైనా రుచి చూడాల్సిందే! - ఏడాది నిల్వ!