Senior Actress Krishnaveni Passed Away : ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి లీలా వంటి ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఘంటసాల, గాయని పి.లీలా వంటి ప్రముఖులను 'మనదేశం'తో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు ఓ వైపు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్‌కు జంటగా అందులో నటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడిగా పనిచేశారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1936లో విడుదలైన 'సతీ అనసూయ'తో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు కృష్ణవేణి నిర్మాతగా వ్యవహరించారు. 'దక్షయజ్ఞం', 'జీవన జ్యోతి', 'భీష్మ', 'గొల్లభామ', 'ఆహుతి' వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
'మనదేశం'తో నిర్మాతగా మారిన కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కుపైగా చిత్రాల్లో నటించారు. 'కీలుగుర్రం', 'బాలమిత్రుల కథ' చిత్రాలకు గాయనిగా పనిచేశారు. రఘుపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ అభినయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకునేవాళ్లకు కృష్ణవేణి చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే బాగా కలిసొస్తుందని బాగా నమ్మేవారు. ఆ నమ్మకంతోనే చాలా మంది హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని కృష్ణవేణి నివాసానికి వచ్చి మరీ ఆమెను ప్రత్యేకంగా పరామర్శించి వెళ్లేవారు.
నాడు నటీనటులకు జీతం రూపంలో డబ్బులిచ్చేవారు కృష్ణవేణి. మనదేశం చిత్రానికి ఎల్వీ ప్రసాద్‌కు 15 వేల రూపాయలిచ్చిన కృష్ణవేణి 'చక్రధారి' చిత్రానికి నాగయ్యకు అత్యధికంగా 90 వేల రూపాయలు జీతంగా ఇచ్చారు. అలాగే 'కీలుగుర్రం' సినిమాకు అక్కినేనికి 10 వేలు ఇచ్చారు. ఆ డబ్బుతో నాగేశ్వర్‌రావు తొలిసారిగా కారు కొనుక్కోవడం విశేషం.