Protective Measures Against Bird Flu : పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్‌ఫ్లూ)నకు చికిత్స సాధ్యం కాదని, నివారణపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సి ఉందని, అప్రమత్తతే ప్రధాన ఆయుధమని ప్రముఖ వెటర్నరీ మైక్రోబయాలజిస్ట్, బర్డ్‌ఫ్లూ నిపుణుడు మండవ వెంకట(ఎంవీ) సుబ్బారావు పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగాన్ని కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర సర్కారులు తక్షణమే కార్యరంగంలోకి దిగాలని ఆయన సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పట్టభద్రుడైన ఎంవీ సుబ్బారావు, జబల్‌పూర్ వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఐవీఆర్‌ఐ)లో సుదీర్ఘకాలం పాటు పని చేసి కోళ్లు, గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులపై విస్తృత పరిశోధనలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో వైరాలజిస్టుగా, రీసెర్చ్ డీన్, ప్రొఫెసర్‌గా పని చేస్తూ పదవీ విరమణ పొందారు. అనంతరం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుకు, ప్రస్తుతం ప్రపంచబ్యాంకుకు, ఐరాసలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో)కు సలహాదారుగా ఆయన పని చేస్తున్నారు. దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
మన దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా మళ్లీ వ్యాపించడానికి కారణాలేంటి?
సుబ్బారావు : మనదేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా 2004 నుంచి ఉంది. ఈసారి నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల కొన్నిచోట్ల వైరస్ ప్రభావం చూపుతోంది. ఇన్‌ఫ్లూయెంజా(బర్డ్‌ఫ్లూ) అనేది టైప్-ఏ వైరస్ కారణంగా వస్తుంది. ఇది ముఖ్యంగా పక్షులను ప్రభావితం చేస్తుంది. అయితే, జంతువులతో పాటు చేపలు, కుక్కలు, పందులకు, కొన్నిసార్లు మనుషులకూ సోకుతుంది.
ఈ వైరస్ ఏ విధంగా సంక్రమిస్తుంది?
సుబ్బారావు : ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ) పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. వలస పక్షుల ద్వారా వస్తుందనే అనుమానంతో మొదట్లో ఒడిశా రాష్ట్రలోని చిలికా సరస్సు, ఇతర ప్రాంతాల్లోని వలస పక్షులకు శాటిలైట్ టెలిమీటర్లు కట్టి విడిచిపెట్టాం. తద్వారా అవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం వెల్లడయ్యేది. ఆ పక్షుల్లో వైరస్ గుర్తించాక వాటిపై పరిశోధనలు చేసి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నాం. వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వలస పక్షుల లాలాజలంతో పాటు రెట్ట, ఇతర శరీర ద్రవాల ద్వారా వైరస్ జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడ నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
సుబ్బారావు : ఈ వైరస్ సోకిన కోళ్ల తల వాచిపోతుంది. వాటి కనురెప్పలు మూతపడతాయి. కోళ్లు అలసటతో కదల్లేవు. కూత పెట్టడానికి కూడా శక్తి ఉండదు. వీటిలో ఈకలు రాలిపోతుంటాయి. దీంతో పాటు పెంకు లేకుండా గుడ్లను పెడతాయి.
నివారణకు తీసుకోవాల్సిన చర్యలు?
సుబ్బారావు : కోళ్లకు వచ్చే బర్డ్‌ఫ్లూ(ఇన్‌ఫ్లూయెంజా)కు చికిత్స లేదు. టీకాల కోసం ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫారాల్లోని కోళ్లు అనారోగ్యంగా కనిపిస్తే, వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వ్యాధి లక్షణాలున్నట్లు తేలితే వ్యాప్తిని నివారించడానికి బయోసెక్యూరిటీ చర్యలు తీసుకోవాలి. నమూనాలను ల్యాబ్నకు పంపి నిర్ధారణ చేసుకోవాలి.
పౌల్ట్రీ ఫారాల్లో పరిశుభ్రతను పాటించాలి. పీపీఈ కిట్లు, కళ్లద్దాలతోనే ఫారంలోనికి ప్రవేశించాలి. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పరికరాలు, ఉపకరణాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. క్లోరినేషన్ చేయాలి. చనిపోయిన కోళ్లను 6 అడుగుల గోతిలో పాతిపెట్టాలి. వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి కోళ్లు, గుడ్ల రవాణా నిలిపివేయాలి.
ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
సుబ్బారావు : పౌల్ట్రీరంగం అనేది దేశంలో ఆహార, వాణిజ్య, ఉపాధి పరంగా అత్యంత కీలకమైంది. ఈ రంగం తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మందికి ఉపాధి చూపుతోంది. బర్డ్‌ఫ్లూ వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో పనిచేయాలి. పశుసంవర్ధకశాఖ, వైద్యశాఖల మీదనే భారం వేయకుండా అన్ని శాఖలను కార్యరంగంలోకి దించాలి. కోళ్ల పెంపకందారులకు, ఫారాల్లోని సిబ్బందికి బయోసెక్యూరిటీ చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం అవసరం. ప్రస్తుతం ఒక్క భోపాల్‌లోనే బర్డ్‌ఫ్లూ నమూనా పరీక్షల ప్రయోగశాల(లెబోరేటరీ) ఉంది. ఈ ప్రయోగశాలలను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలి.
చికెన్, గుడ్లు తినడం ప్రమాదకరమా ?
వ్యాధి సోకిన చోట చికెన్ క్రయవిక్రయాలను నిలిపివేయాలి. బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం లేనిచోట ఎలాంటి ప్రమాదం ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ అనేది బతకదు. కోడిమాంసం, గుడ్లను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చికెన్‌లోని ఎముకలు మెత్తపడేంత వరకు ఉడికిస్తే వైరస్ ప్రభావం ఉండదు.