Akhanda 2 Thaandavam Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా సూపర్ హిట్ అందుకుంది. అదే జోష్‌లో ఉన్న బాలయ్య తన తదుపరి సినిమా 'అఖండ 2: తాండవం' షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణని జరగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ'కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే 'అఖండ 2: తాండవం'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పకులు. సంచలన విజయం సాధించిన 'అఖండ'కి దీటుగా, భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఆరంభమైన మహా కుంభమేళాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. 'బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రమిది. యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. అంచనాలకి తగ్గట్టుగానే ఉంటుందని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరింత పవర్‌ఫుల్‌గా శివభక్తుడు
ఇప్పటికే బాలయ్య మొదటి భాగంలో శివ భక్తుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలోనూ ఆయన శివ భక్తుడిగా , మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా నిజ జీవితంలోనూ బాలయ్య సంప్రదాయాలకు ఎంత విలువనిస్తారో తెలిసిందే. ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పుడు అఖండ 2లో అలానే కనిపించనున్నారు. ఆచారాల కోసం పోరాడే, దేవాలయాలను, వాటి పవిత్రతను కాపాడే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్‌ఫుల్ పాత్రకు బోయపాటి శక్తివంతమైన డైలాగులు రాస్తున్నారట.