Mobile Recharge Rate Increase :సార్వత్రిక ఎన్నికల తర్వాత మొబైల్ వినియోగదారులకు షాక్ తగలనుందా? టెలికాం టారిఫ్ ఛార్జీలు మరో రెండు నెలల్లో పెరగనున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు మార్కెటింగ్ నిపుణులు. లోక్ సభ ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ పెంపు ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 15-17 శాతం వరకు టారిఫ్ ఛార్జీలను టెలికాం కంపెనీలు పెంచుతాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ అతిపెద్ద లబ్ధిదారు కానుందని అంటున్నారు.
భారత్లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత టెలికాం టారిఫ్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. 'ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమ 15-17 శాతం టారిఫ్ పెంచుతుందని అంచనా వేస్తున్నాం' అని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
2021 డిసెంబర్‌లో చివరిసారిగా భారతీ ఎయిర్‌టెల్ 20 శాతం టారిఫ్ ఛార్జీలను పెంచింది. ఈసారి టారిఫ్ పెంపుతో భారతీ ఎయిర్‌టెల్ సగటు వినియోగదారు ఆదాయం(ARPU) రూ.208 నుంచి రూ.286కు పెరగనుందని అంచనా. ఇక జియో ARPU రూ.182 కాగా, వొడాఫోన్ ఐడియా రూ.145గా ఉంది. మార్కెట్ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.