Low Interest Rates With A Good Credit Score : బ్యాంకులు లేదా రుణదాత లోన్స్ ఇచ్చే ముందు కచ్చితంగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతో లోన్లు మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోరు తక్కువ ఉన్నవారి లోన్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. లేదంటే రుణంపై అధిక వడ్డీ వేస్తాయి. అందుకే లోన్లు ఈజీగా, తక్కువ వడ్డీ రేటుతో మంజూరు అవ్వాలంటే సిబిల్ స్కోరు చాలా ముఖ్యం. అప్పుడే మీరు రుణదాతతో లోన్ వడ్డీ రేట్ల విషయంలో మాట్లాడగలరు. ఈ క్రమంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?
రుణం తీసుకోవాలనుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు 750 ఉందనుకుందాం. అప్పుడు అతడికి బ్యాంకులు లేదా రుణదాతలు ఈజీగా లోన్‌ను మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని ఇస్తాయి. వడ్డీ రేటు విషయమై ఆ వ్యక్తి బ్యాంకులతో చర్చించవచ్చు. అదే రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు 500-600 ఉందనుకోండి. అతడికి లోన్ మంజూరు కష్టమవుతుంది. ఒకవేళ లోన్ మంజూరు అయినా, రుణ సంస్థలు ఎక్కువ వడ్డీ రేటును విధిస్తాయి. అలాగే వడ్డీ విషయంలో రుణగ్రహీతతో చర్చలు కూడా జరపలేడు. అందుకు కారణం అతడి పేలమైన క్రెడిట్ స్కోరే కారణం అని చెప్పాలి.
వడ్డీ రేటు విషయంలో రుణదాతతో చర్చించే ముందు పరిశీలించాల్సిన అంశాలు?
క్రెడిట్ స్కోర్
రుణ సంస్థలతో వడ్డీ రేటుపై చర్చించే ముందు మీ క్రెడిట్ స్కోరును తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటును మీరు అడగొచ్చు.
వడ్డీ రేట్లు
వివిధ బ్యాంకులు, రుణ సంస్థలు లోన్‌పై విధించే వడ్డీ రేట్లను తెలుసుకోండి. అది మీరు లోన్ తీసుకోబోయే సంస్థతో వడ్డీ రేటు మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది.
క్రెడిట్ యోగ్యత
వడ్డీ రేటు విషయంలో రుణదాతతో చర్చలు జరుపుతున్నప్పుడు మీ మంచి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ను తెలియజేయండి. అప్పుడు రుణదాతలు తక్కువ క్రెడిట్ రిస్క్ ఉన్న రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకి లోన్ మంజూరు చేసే అవకాశం ఉంది.
వివిధ బ్యాంక్‌ల వడ్డీ రేట్లను పరిశీలించండి
మార్కెట్లో ఉన్న రుణసంస్థలు, అవి విధించే వడ్డీ రేట్లను తెలుసుకోండి. అప్పుడు మీరు తీసుకునే లోన్‌పై విధించే వడ్డీ కంటే ఇతర బ్యాంకులు తక్కువకు ఇస్తున్నాయా లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.