Loan With Aadhaar Card : ఆధార్ కార్డ్‌తో లోన్! ఔను మీరు విన్నది నిజమే. మన దగ్గరున్న ఆధార్ కార్డ్‌తో రూ.50,000 దాకా లోన్‌ను పొందొచ్చు. ఈవిధంగా రుణాలను మంజూరు చేసేందుకు కరోనా సంక్షోభ కాలంలో (2020 సంవత్సరంలో) ఒక స్కీంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని పేరు ‘పీఎం స్వనిధి యోజన’. ఇంతకీ ఈ స్కీంకు ఎలా అప్లై చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
అప్లై చేయడం ఎలా ?
పీఎం స్వనిధి యోజన స్కీంను ప్రధానంగా చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా లోన్‌ను పొందేందుకు పీఎం స్వనిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్‌ను సమర్పించొచ్చు. సమీపంలోని ఏదైనా ప్రభుత్వ బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)లోనూ దీనికి దరఖాస్తు చేయొచ్చు. ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే చాలు, ఎలాంటి పూచీకత్తు (గ్యారంటీ) లేకుండానే రుణాన్ని మంజూరు చేస్తారు. కరోనా సంక్షోభ కాలంలో చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు చాలా ఇబ్బందిపడ్డారు. ఆనాడు వారి ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది. అటువంటి క్లిష్టతరుణంలో వారిని ఆదుకునే గొప్ప సంకల్పంతో పీఎం స్వనిధి స్కీంను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ స్కీం ద్వారా రుణాలను పొంది తమ వ్యాపారాలను నిలబెట్టుకున్నారు.
లోన్ ఎంత ఇస్తారు?
‘పీఎం స్వనిధి’ లోన్‌కు తొలిసారి అప్లై చేయగానే రూ.50,000 రుణం మంజూరు కాదు. తొలుత రూ.10వేల దాకా రుణాన్ని ఇస్తారు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిగా రూ.20వేల దాకా రుణాన్ని ఇస్తారు. ఈ విధంగా లోన్ అమౌంటును రూ.50వేల దాకా పెంచుకుంటూ పోతారు. లోన్‌ను తిరిగి చెల్లించేందుకు 12 నెలల గడువును ఇస్తారు. ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది.
లోన్ అప్లికేషన్‌తో పాటు ఇంకేం కావాలి?
- ఈ లోన్‌కు అప్లై చేసేవారు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. తొలుత దరఖాస్తు ఫామ్‌ను పూర్తిగా చదివి అందులోని అంశాలను అర్థం చేసుకోవాలి. అనంతరం దాన్ని భర్తీ చేయాలి.
- దరఖాస్తు చేసే వ్యక్తి తన ఆధార్ కార్డుకు, తన ఫోన్ నంబర్‌ను తప్పకుండా లింక్ చేసుకోవాలి. ఎందుకంటే లోన్ అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసే క్రమంలో ఈ-కేవైసీ/ఆధార్ వ్యాలిడేషన్ చేస్తారు.
- పీఎం స్వనిధి లోన్, ఇతర ప్రభుత్వ పథకాలకు సదరు వ్యక్తి అప్లై చేసేందుకు అభ్యంతరం లేదని తెలుపుతూ అర్బన్ లోకల్ బాడీ (మున్సిపాలిటీ/నగరపాలక సంస్థ) జారీ చేసిన సిఫారసు లేఖను దరఖాస్తుదారుడు తీసుకోవాలి.
లోన్‌పై వడ్డీరేటు
పీఎం స్వనిధి స్కీం ద్వారా పొందే రుణాలపై వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం విధిస్తారు. ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో అమలవుతున్న వడ్డీరేట్లే ఈ లోన్లకు కూడా వర్తిస్తాయి.
స్టార్టప్ లోన్ కావాలా? ఈ అర్హతలు, డాక్యుమెంట్లు మస్ట్!
నెలకు రూ.15వేలు జీతం వచ్చినా పర్సనల్ లోన్- రుణాలు ఇచ్చే బ్యాంకులివే!