How To Get Startup Loan : ప్రస్తుతం భారత్‌లో స్టార్టప్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఔత్సాహిక యువతీయువకులను ప్రోత్సహిస్తామని చెబుతోంది. మరి మీరు కూడా మీ కలల స్టార్టప్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. స్టార్టప్ ప్రారంభించాలంటే గొప్ప ఐడియా ఉంటే సరిపోదు. దానిని ప్రారంభించేందుకు ఎంతో డబ్బు అవసరం అవుతుంది. మనలో చాలా మందికి ఇదే పెద్ద సమస్య. అందుకే చాలా మంది బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మరి బ్యాంకులు మీ స్టార్టప్‌లకు లోన్స్ ఇవ్వాలంటే, మీకు ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏయే పత్రాలు అవసరం అవుతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Startup Business Loan Eligibility
- స్టార్టప్ బిజినెస్ లోన్ కావాలంటే, మీ వయస్సు 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- మీ క్రెడిట్ స్కోర్ 700 పాయింట్లకు మించి ఉంటేనే, త్వరగా స్టార్టప్ బిజినెస్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.
- మీ బిజినెస్ ప్లాన్‌ను కూడా బ్యాంకులకు తెలియజేయాలి. దీనిలో మీ బిజినెస్ విజన్, స్ట్రాటజీలు చాలా స్పష్టంగా ఉండాలి.
- బిజినెస్ లోన్ కావాలంటే, కచ్చితంగా మీ దగ్గరున్న ఆస్తులను తనఖా పెట్టాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు డిఫాల్ట్ అయితే మీరు తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకుంటాయి.
- మీరు వ్యాపారం చేయాలనుకుంటున్న రంగంలో మీకు ఎంత అనుభవం ఉందో తెలియజేయాలి. దీని వల్ల మీకున్న వ్యాపార దక్షత తెలుస్తుంది.
- ఒక వేళ మీరు మీ స్టార్టప్‌ను మరింతగా విస్తరించాలని అనుకుంటే, మీరు వ్యాపారం ప్రారంభించిన తరువాత కనీసం 6 నెలలకు మించి దానిని విజయవంతంగా నడపాల్సి ఉంటుంది.
- ఈ విధంగా మీకు అన్ని అర్హతలు ఉంటే, బ్యాంకులు చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తాయి.
Startup Loan Documents
స్టార్టప్ బిజినెస్ కోసం కొన్ని కీలక పత్రాలు కావాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- బిజినెస్ ప్లాన్ : మీ బిజినెస్ మోడల్, వ్యాపార విస్తరణ ప్రణాళిక, వృద్ధి వ్యూహాల గురించి తెలుపుతూ బిజినెస్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి.
- ఐడెంటిటీ ప్రూఫ్ : ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీలను మీ గుర్తింపు కార్డులుగా ఉపయోగించవచ్చు.
- అడ్రస్ ప్రూఫ్ : మీ బిజినెస్ ప్రాపర్టీ పత్రాలు, అద్దె పత్రాలు, యుటిలిటీ బిల్స్‌ను చిరునామాగా వాడుకోవచ్చు.
- బిజినెస్ రిజిస్ట్రేషన్ : మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్‌కార్పొరేషన్ పత్రాలు, పార్టనర్‌షిప్ డీడ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
- ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్స్ : మీ స్టార్టప్‌కు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు సమర్పించాలి.
- తనఖా పత్రాలు : మీరు తనఖా పెట్టే ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- వ్యాపారం కోసం పరికరాలు, ఇన్వెంటరీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే మార్కెటింగ్ కోసం డబ్బులు కావాలి. వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. వీటికి అనుగుణంగా ఎంత లోన్ కావాలన్నది నిర్ణయించుకోవాలి.
- బ్యాంకు రుణాలు తీసుకోవడమే కాదు, వాటి వాయిదాలను కూడా సకాలంలో తీర్చగలగాలి. కనుక మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా వడ్డీ తీర్చగలిగే విధంగా చూసుకోవాలి.
- ఇందుకోసం వివిధ బ్యాంకులు బిజినెస్ లోన్స్‌పై వసూలు చేసే వడ్డీ రేట్లు, ఫీజులు, ఇతర అనుబంధ ఛార్జీలను సరిపోల్చుకోవాలి.
- ఆస్తులను తనఖా పెట్టి కూడా బిజినెస్ లోన్స్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే కాస్త తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
MSMEలకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్ లోన్స్ - రూ.100 కోట్ల వరకు!