TGSRTC JAC Strike : టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్‌కు జనవరి 27న సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీకి కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికే చర్చలకు ఆహ్వానించినట్లు కార్మికశాఖ స్పష్టం చేసింది.
కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే :
- ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం
- రెండు పీఆర్‌సీల అమలు
- 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.
- కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగభద్రతపై మార్గదర్శకత్వం.
- పీఎఫ్, సీసీఎస్ బకాయిల చెల్లింపు.
- ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు చేయాలి.
- ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలి.
- ఈ-బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారు. వీటిపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది.
- ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే తీసుకుని నడపడం వల్ల సబ్సిడీ కూడా ఆర్టీసీకి వస్తుంది.
- ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలి.
- సంస్థ అప్పులను టేకోవర్ చేయాలి.
- మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్‌కు బదులు మహిళలకు స్మార్ట్‌కార్డుల పంపిణీ.
- రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.
- ఆర్టీసీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
- పదేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ఉద్యోగులపై పని భారం పెరిగింది.
- సుమారు 16 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా వారి పనిని సర్వీసులో ఉన్న ఉద్యోగులే చేయాల్సి వస్తోంది.
- పొరుగుసేవల కింద పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సూపర్‌వైజర్లను తొలగించి పదోన్నతులు ద్వారా ఆయా పోస్టుల భర్తీ చేయాలి.
- కార్మికులకు 8 గంటల పని దినాలు అమలు కావాలి.
- మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల్లోపు విధులు ముగిసేలా చూడాలి.
- పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన సుమారు రూ.12 వేల కోట్లను యాజమాన్యం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపించలేదు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి.