New Ration Card Apply : కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు మీసేవ కమిషనర్‌కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. రేషన్ కార్డుల డేటా బేస్‌ను మీసేవకు అనుసంధానం చేయాలని ఎన్‌ఐసీని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కోరారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. గతంలో ప్రజాపాలన సదస్సులు ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని డుప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. తెల్లరేషన్ కార్డు కోసం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపు వార్షికాదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాల గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం విధించింది.