India's Gold Industry Sets Up A Self-Regulatory Body:దేశీయ పసిడి పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. పసిడి రంగంలో పారదర్శకత పెంచడం సహా, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఒక స్వయం నియంత్రిత సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)ను ప్రకటించింది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మద్దతుతో ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్)ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం వెల్లడించింది.
ఐఏజీఈఎస్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
స్వతంత్ర పాలన, వృత్తి నిపుణులతో నిర్వహించే ఐఏజీఈఎస్కు సభ్యులను త్వరలోనే ప్రకటించనున్నారు. అనంతరం విధివిధానాలనూ సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరి కల్లా ఇది కార్యకలాపాలను ప్రారంభించొచ్చని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (భారత్) సచిన్ జైన్ వెల్లడించారు.
ఐఏజీఈఎస్లో ఎవరెవరు ఉంటారు?
ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్టాండర్డ్స్(ఐఏజీఈఎస్)ను జాతీయ పసిడి పరిశ్రమ సంఘాలైన ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(జీజేసీ), జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వంటి సంఘాలతో ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు చెందిన వేర్వేరు వర్గాలతో కలిపి దీనిని ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు, ప్రభుత్వ విశ్వాసాన్ని పొందగలమని జైన్ తెలిపారు.