Electric Vehicle Sales In Telangana : ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఇంధన వ్యయాన్ని, కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఖర్చులనూ గణనీయంగా ఆదా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీల నూతన పాలసీ గతేడాది నవంబరు 18 నుంచి అమల్లోకి వచ్చింది. డిసెంబరు 31 వరకు అంటే 44 రోజుల వ్యవధిలో 8,479 ఈవీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మేరకు ఆయా వాహన యజమానులకు రూ.69.74 కోట్ల పన్నులు, ఫీజుల్ని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది. ఈవీ కార్లు కొన్నవారికి రిజిస్ట్రేషన్ సమయంలోనే సగటున రూ.3.14లక్షల వరకు ద్విచక్ర వాహనాలు కొనేవారికి సగటున రూ.11వేలకు పైగా ఆదా అవుతుంది.
ఈవీలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల రుసుములను మినహాయించడం ద్వారా రవాణాశాఖ సగటున రోజుకు రూ.1.57 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ మేరకు ఏడాదికి దాదాపు రూ.570 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశముందని నిపుణలు అంచనా వేస్తున్నారు. దీన్నే 2026 డిసెంబరు 31 వరకు అంచనా వేస్తే ఈ మొత్తం రూ.1,200 కోట్లు దాటే అవకాశముంది.
రాష్ట్రంలో పెరగుతున్న 'ఈవీ' జోరు - 'నో ట్యాక్స్' విధానంతో పెరిగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రావొద్దని : దిల్లీలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి పాఠశాలల్ని సైతం మూసివేయాల్సిన పరిస్థితులోస్తున్నాయి. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నవంబరులోనే ప్రకటించారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఈవీలు కొనేవారికి రోడ్ ట్యాక్స్‌ను, రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయిస్తోంది.
చాలా వరకు ప్రయోజనం : వ్యక్తిగతంగా వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ ట్యాక్స్‌ను 15 ఏళ్లకు ఒకసారి వాహన రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేస్తారు. ఈ మేరకు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనం కొనేవారికి కొత్త పాలసీ కింద రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు పెద్దమొత్తంలో ఒకేసారి మిగులుతోంది. ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సులు వంటి రవాణా వాహనాలకు త్రైమాసిక పన్ను రూపంలో 15 సంవత్సరాలు విడతలవారీగా ఆ ప్రయోజనం లభిస్తుంది. 2024 నవంబరు 18 నుంచి డిసెంబరు 31 వరకు 6,126 ద్విచక్రవాహనాలు, 1,726 ప్రైవేటు కార్లు, అలాగే 645 ట్యాక్సీలు, ఆటోలు, బస్సులు, గూడ్సు వాహనాలు రిజిస్టర్ అయ్యయి. వీటిలో వ్యక్తిగత వాహనాలకు సంబంధించి ద్విచక్రవాహనాలకు రూ.7.12 కోట్లు, ప్రైవేటు కార్లకు రూ.54.14 కోట్లు ఆదా అయింది.
స్కాన్ చేస్తే చాలు బండికి ఛార్జింగ్ - కొత్త ఆదాయ మార్గంగా ఈవీ పాయింట్