Hussain Sagar Missing Update : హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలోని భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహాహారతి కార్యక్రమం ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు సాగర్‌లో బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు.
నీటిలో దూకాడా! లేక పడవలోనే ఉండిపోయాడా? : హైదరాబాద్ నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు స్నేహితులతో కలిసి క్రాకర్స్ వ్యాపారి మణికంఠ సహాయంతో కార్యక్రమాన్ని చూసేందుకు పడవలో హుస్సేన్‌సాగర్ లోపలికి వెళ్లారు. లైఫ్ జాకెట్ కూడా లేకుండానే ముగ్గురు లోపలికి వెళ్లి కార్యక్రమాన్ని తిలకిస్తుండగా తారాజువ్వలు ఎగిరి వారు నిల్చున్న పడవపై పడ్డాయి. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. భయంతో పడవలోని వారంతా సాగర్‌లో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ అజయ్ మాత్రం నీటిలో దూకాడా! లేక పడవలోనే ఉండిపోయాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మహాహారతి కార్యక్రమం చూసేందుకు ట్యాంక్‌బండ్‌కి వెళ్లొస్తానని తెలిపిన కుమారుడు అర్థరాత్రి దాడినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అజయ్‌కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని వారు తెలిపారు. తీరా చూస్తే సాగర్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అతని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఉదయాన్నే ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.
ఇంకా లభించని ఆచూకీ : అగ్నిప్రమాదం కారణంగా కుమారుడు అదృశ్యమైనట్లు అజయ్ తల్లిదండ్రులు సాగర్ లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ అజయ్ ఆచూకీ లభించలేదు.
రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి : హుసేన్ సాగర్‌లో జరిగిన బోటు ప్రమాదంలో గాయపడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైద్య ఖర్చులు, నష్టపరిహారం చెల్లించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టూరిజం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ప్రమాద సమయంలో ఔట్ సోర్సింగ్ బోటు డ్రైవర్స్ ప్రాణాలకు తెగించి 11 మందిని రక్షించారని గుర్తు చేశారు.
ఈ ఘటనలో గణపతి అనే ఉద్యోగి 90 శాతం గాయాలతో యశోద హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. గాయాలపాలైన బోట్ డ్రైవర్స్ చికిత్సకు సంబంధించి పూర్తి ఖర్చులను భరించాలని, పూర్తిగా కోలుకొనేవరకు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పించాలని, అలాగే వారి ఆరోగ్య ఖర్చుల కోసం తక్షణం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బోట్లు కాలిపోవడం వల్ల టూరిజం సంస్థకు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని అన్నారు.
హుస్సేన్‌సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో యువకుడి అదృశ్యం? - గాలింపు చర్యలు ముమ్మరం
హుస్సేన్‌సాగర్‌లో 2 బోట్లలో భారీ అగ్నిప్రమాదం - బాణాసంచా పేలుస్తుండగా ఘటన