One Nation One Election Panel : జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్‌సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలిరోజున నివేదికను సభ ముందుంచాలని గడువు విధించారు. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.
కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేశ్ (బీజేపీ- అనకాపల్లి), వల్లభనేని బాలశౌరి (జనసేన- మచిలీపట్నం), జి.ఎం.హరీశ్ బాలయోగి (తెదేపా- అమలాపురం)కు స్థానం కల్పించారు. బీజేపీ ఎంపీలైన పీపీ చౌధరి (రాజస్థాన్), భాన్సురీ స్వరాజ్ (దిల్లీ), పురుషోత్తం రూపాలా (గుజరాత్), అనురాగ్ సింగ్ ఠాకుర్ (హిమాచల్‌ప్రదేశ్), విష్ణుదయాళ్‌రాం (ఝార్ఖండ్), భర్తృహరి మహతాబ్ (ఒడిశా), సంబిత్‌పాత్ర (ఒడిశా), అనిల్‌బలూని (ఉత్తరాఖండ్), విష్ణుదత్ శర్మ (మధ్యప్రదేశ్) ఈ కమిటీలో ఉన్నారు.