Indians Trafficked Via Canada : కెనడా మీదుగా భారతీయులను అమెరికాకు అక్రమంగా తరలించడం ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ ఆంగ్లపత్రికతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇలా భారతీయుల అక్రమ రవాణాపై గడిచిన రెండేళ్లలో కెనడా వద్ద భారత్ పలుమార్లు అందోళన వ్యక్తం చేసింది.
ఇదే విషయంపై గ్లోబల్ అఫైర్స్ కెనడా విభాగం ప్రతినిధి స్పందించారు. "భారత్-కెనడా మధ్య విస్తృతమైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఇలా వేర్వేరు అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. అందులో విదేశాల్లో మా పౌరుల వలసలు, భద్రత, సంక్షేమం వంటి అంశాలు ఉన్నాయి. నేరాలు, మోసాలను అదపు చేయడానికి భారత్ అధికారులతో కలిసి పనిచేయడానికి కెనడా సిద్ధంగా ఉంది" అని వెల్లడించారు.
మరోవైపు, గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా 2022 జనవరిలో మరణించింది. ఈ కేసును ఆధారంగా చేసుకొని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్‌తో పాటు మరికొందరి పైనా మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ చివరి వారంలో ముంబయి, నాగ్‌పుర్, గాంధీనగర్, వడోదర సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది.