Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొసాగుతోంది. బస్తర్ రీజియన్‌లో భద్రతబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృతిచెందారు. జిల్లా రిజర్వ్ గార్డు దళానికి చెందిన ఒక హెడ్‌కానిస్టేబుల్ కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
నారాయణపుర్, దంతేవాడ జిల్లా సరిహద్దుల్లోని దక్షిణ అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం భద్రతా దళాల జాయింట్ టీమ్ కూంబింగ్ చేపట్టింది. ఈ సమయంలోనే మావోయిస్టులు, పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీనితో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి, నలుగురు మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటన స్థలంలోని ఏకే-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్), సహా పలు ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
మావోయిస్ట్‌లు ఏరివేత
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అందుకే వారిని తుదముట్టించేందుకు భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టాయి. అందులో భాగంగానే భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్‌లోనూ సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలో నారాయణపుర్‌లోని అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురకాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు.
2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్!
భారతదేశంలో మావోయిస్ట్‌లను పూర్తిగా అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 'మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని, 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని' కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ వ్యూహం వల్లే మావోస్టుల తీవ్రవాదం హింస 72 శాతానికి తగ్గిందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు అమిత్ షా తెలిపారు.