AAP Vs BJP In Delhi : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దిల్లీలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోయినప్పటికీ ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శల దాడులను మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ ఆప్‌ను ఆపదగా అభివర్ణిస్తే- కేజ్రీవాల్ ఆయన వ్యాఖ్యలను అదేస్థాయిలో తిప్పికొట్టారు.
పోస్టర్ల పాలి'ట్రి'క్స్
ఇదిలా ఉండగా, ఓటర్లదృష్టిని ఆకర్షించేందుకు ఇరుపార్టీలు పోస్టర‌్ల యుద్ధానికి తెరలేపాయి. భారీ ప్రజాదరణ పొందిన పుష్ప, గోట్ చిత్రాల పోస్టర్లతో విమర్శలు సంధించుకున్నాయి. పుష్పలో అల్లు అర్జున్ తుపాకీ పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ కేజ్రీవాల్ చీపురు పట్టుకుని తగ్గేదేలే అనే విధంగా మార్చి విడుదల చేసింది. దానికి పోటీగా బీజేపీ కూడా ఆ పార్టీ దిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఫొటోతో 'అవినీతిని అంతమొందిస్తాం రప్పా రప్పా' అంటూ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. హర్షద్‌మెహతా స్కామ్ తరహాలో 2024 పేరుతో కేజ్రీవాల్ చిత్రాన్ని బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఆయన్ను దేశభక్తుడిగా పేర్కొంటూ ఆప్ గోట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
వరుడు లేని గుర్రం- నెక్ట్స్ మాదే అధికారం!
తాజాగా బీజేపీని విమర్శిస్తూ ఆప్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ఆప్ బీజేపీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ కూడా దీటుగానే స్పందించింది. దేశ రాజధానిలో బీజేపీ అధికారం చేపడుతుందని దిల్లీ ప్రజలకు ఆపద తొలగిపోతుందని ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.
BJP वालों, तुम्हारा दूल्हा कौन है❓ pic.twitter.com/yHJCwKY4hb
— AAP (@AamAadmiParty) January 5, 2025
AAP-दा जाएगी, भाजपा आएगी#AAPदा_मुक्त_दिल्ली pic.twitter.com/zSiMbs4nQ7
— BJP Delhi (@BJP4Delhi) January 5, 2025
అవినీతిలో ఆప్ - మీరు చేసింది తుస్!
ప్రభుత్వం దిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని మోదీ ఇటీవల విమర్శలు గుప్పించారు. ప్రధాని వ్యాఖ్యలను కేజ్రీవాల్ గట్టిగా తిప్పికొట్టారు. దిల్లీకి కేంద్రం చేసింది ఏమీ లేదని అందుకే ఆయన తన ప్రసంగం ఆప్ ప్రభుత్వంపై దూషణలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. దిల్లీకి ఏదైనా చేసి ఉంటే చెప్పేవారు కదా అని కేజ్రీవాల్ సూటిగా ప్రశ్నించారు.
పదేళ్లుగా ఆప్ పాగా - ఇకనైనా సాగుతుందా బీజేపీ సాగా!
దిల్లీలోని మొత్తం 70శాసనసభ స్థానాలు ఉండగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. 2015 నుంచి పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఆప్ ముచ్చటగా మూడోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా దిల్లీలో పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూదిల్లీలో మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మొత్తంగా దిల్లీ పోరు ఈసారి రసవత్తంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.