PM Modi Fires On AAP : దిల్లీలోని ఆప్ సర్కార్ గత దశాబ్ద కాలంగా కేంద్రంతో పోరాడుతూ సమయం వృథా చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ రాజధానిని భవిష్యత్తు నగరంగా మార్చేందుకు బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయదని, అవినీతిని అంతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ప్రాంతంలో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says " the entire delhi is proud of bharat mandapam, yashobhoomi, kartavya path...i feel sad that the 'aap-da' people have wasted 10 years of the people of delhi. there are several places in delhi where cabs… pic.twitter.com/1EdJIueRrS
— ANI (@ANI) January 5, 2025
దిల్లీ ఆపదగా ఆప్ సర్కార్ : మోదీ
దిల్లీకి ఆప్ సర్కార్ ఆపదగా ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దిల్లీలో బీజేపీ మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు. దిల్లీలో ఆపద(ఆప్‌ను ఉద్దేశించి) ప్రభుత్వం తొలగిపోతే, అభివృద్ధి చేసే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో హైవేల అభివృద్ధి చేస్తోందని, మెట్రో నెట్వర్క్ విస్తరణ పనులు చేపడుతోందని తెలిపారు. నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించిందని వెల్లడించారు.
'ఆప్ దృష్టి అంతా శీష్ మహల్ పైనే'
"దిల్లీ మెట్రో స్టేషన్ నుంచి బయటకు అడుగు పెట్టగానే గుంతల రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాల్వలు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా దిల్లీ ఆపద సర్కార్‌ను చూసింది. అందుకే ప్రజలు 'ఆపద సర్కార్‌ను ఇక తట్టుకోలేము. మార్పును తీసుకురండి' అని స్లోగన్ ఇస్తున్నారు. కొవిడ్ సమయంలో దిల్లీ ప్రజలు ఆక్సిజన్, మందుల కోసం ఇబ్బందులు పడుతుంటే ఆప్ సర్కార్ దృష్టి మాత్రం శీష్ మహల్ నిర్మాణంపైనే ఉంది. శీష్ మహల్ నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారు. ఇది నిజం. దిల్లీ ప్రజలను ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదు. "
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
#WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says " this 'aap-da' government does not have a vision for the development of the people of delhi. even today, all the development works in delhi are done by the central government. delhi metro has reached… pic.twitter.com/v8I6cfSmFe
— ANI (@ANI) January 5, 2025
'అభివృద్ధి పనులన్నీ మేమే చేస్తున్నాం'
దిల్లీలో కమలం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని మోదీ తెలిపారు. దిల్లీలోని ఆపద సర్కార్‌కు ప్రజల అభివృద్ధిపై దృష్టి లేదని ఆరోపించారు. దిల్లీలో అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లను కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తోందని వెల్లడించారు.
"మనం 2025లో ఉన్నాం. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు అయిపోయాయి. అంటే పావు శతాబ్దం అయిపోయింది. రాబోయే 25 ఏళ్లు దిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకం. గతేడాది కేంద్ర ప్రభుత్వం భద్రత, ఆరోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దిల్లీకి రూ.75,000 కోట్లు ఇచ్చింది. దిల్లీలో పట్టణాభివృద్ధికి నమూనాగా నిలిచే అభివృద్ధి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది." అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says " we are in the year 2025. 25 years of the 21st century have passed. that means a quarter of a century has passed. during this time, probably 2-3 generations of youth in delhi have grown up. now the… pic.twitter.com/nG81d7qyRC
— ANI (@ANI) January 5, 2025
'ఎండాకాలం వస్తే తాగునీటికి ఇబ్బందులు'
దిల్లీ రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఆపద సర్కార్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని మోదీ ఆరోపించారు. దేశ రాజధాని వాసులు ఎండాకాలం వస్తే తాగునీటి కోసం ఇబ్బందులు, వర్షం వస్తే నీటి ఎద్దడి, చలికాలం వస్తే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దిల్లీవాసుల శక్తి ఏడాదంతా ఆపద సర్కార్‌తో పోరాడేందుకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కూడా ఆప్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
'బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు రెడీ'
"దిల్లీ ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఆశీర్వదించారు. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపద సర్కార్ నుంచి దిల్లీకి విముక్తి కల్పించడానికి ప్రజలకు ఇదే మంచి అవకాశం." అని మోదీ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
అంతకుముందు దేశ రాజధాని దిల్లీలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ నమో భారత్ కారిడార్, దిల్లీ మెట్రో ఫేజ్ IVలోని జనక్ పురి వెస్ట్-కృష్ణా పార్క్ మెట్రో విస్తరణ పనులను మోదీ ప్రారంభించారు. అలాగే రిథాలా-నరేలా-కుండ్లీ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు.
మెట్రోలో మోదీ ప్రయాణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్, దిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్ఆర్ టీఎస్ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13కిలోమీటర్లు విభాగంలో 6కిలోమీటర్లు మేర భూగర్భంలో నడవనున్నట్లు అధికారులు తెలిపారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
'ప్రధాని ఆ అపోహను తొలగించారు'
దిల్లీ ప్రజల్లో ప్రధాని మోదీ ఉత్తేజాన్ని నింపారని బీజేపీ నేత కైలాశ్ గహ్లోత్ తెలిపారు. దిల్లీ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ వచ్చి బీజేపీ సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని ఆప్ సృష్టించిన అపోహలను తొలగించారని పేర్కొన్నారు.
అప్పుడు మాత్రమే కేంద్రంతో సంఘర్షణ : కేజ్రీవాల్
ఆప్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి పదేళ్లు వృథాచేసిందన్న ప్రధాని మోదీ విమర్శలను దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. ఏదైనా పని జరగనప్పుడు మాత్రమే తాము సంఘర్షణపథం ఎంచుకున్నట్లు చెప్పారు. తమ పార్టీ నేతలను, ప్రభుత్వాన్ని వేధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఉంటే దిల్లీ మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్ ప్రారంభోత్సవాలు జరిగేవి కాదని కేజ్రీవాల్ తెలిపారు.
"ఆమ్ ఆద్మీ పార్టీ ఘర్షణ పడుతోందని ఆరోపణలు చేసేవారికి తాజా ప్రారంభోత్సవాలే సమాధానం. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం దిల్లీ ప్రజల కోసం పనిచేస్తుంది. మా పార్టీకి చెందిన ముఖ్యనేతలను జైలుకు పంపారు. తమపై జరిగిన వేధింపులను దృష్టిలో పెట్టుకుని ఉంటే దిల్లీ మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్ లైన్ పనులు, ప్రారంభోత్సవాలు జరిగేది కాదు. మేం జైలు నుంచి విడుదలయ్యాక ఏమైన జరగని దిల్లీ పనులు ఆగకూడదని చెప్పాం. అందుకోసం అవసరమైనప్పుడు వారి ముందు చేతులు చాచాం, కాళ్లూ పట్టుకున్నామనే విషయాన్ని సంయుక్తంగా జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చాటుతున్నాయి. ఏదైనా పని జరగనప్పుడు మేం సంఘర్షణ మార్గం ఎంచుకున్నాం."
--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ మాజీ సీఎం
'దేశరాజధానిలో శాంతి భద్రతలు విఫలం'
ప్రధాని మోదీ ప్రసంగంలో అరవింద్ కేజ్రీవాల్‌ను దుర్భాషలాడడం తప్ప ఇంకేమీ లేదని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఎద్దేవా చేశారు. దిల్లీలో సగం పాలన కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉందని, దేశరాజధానిలో శాంతిభద్రతల బాధ్యత వారిదేనని తెలిపారు. గత రెండేళ్లలో దిల్లీలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అందరూ చూస్తున్నారని విమర్శించారు.