2050 Master Plan About Hyderabad : బాహ్యవలయ రహదారి వరకు నగరాన్ని విస్తరించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ భారీ సర్వేకు నడుం బిగించింది. దాదాపు 40లక్షల నిర్మాణాలకు సంబంధించిన 21 రకాల వివరాలను ఒకే పటంపైకి తీసుకొచ్చారు. అలా దాని సాయంతో 2050 బృహత్తర ప్రణాళికను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే గ్రేటర్‌లో చేపట్టిన జీఐఎస్ ఇళ్ల సర్వేను ప్రామాణికంగా తీసుకుని దాన్ని శివారులోని 27 స్థానిక సంస్థల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలిచ్చారు. త్వరలో పనులు చేపట్టి, సెప్టెంబరు, 2025 నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
- మొత్తం భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేయడం
- రోడ్లు, తాగునీటి, మురుగునీటి పైపులైన్లు, విద్యుత్తు లైన్లు, చెట్లు, పార్కులు, పైవంతెనలు, నాలాలు, కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి 21 రకాల వివరాల నమోదు, మౌలిక సౌకర్యాల్లోని లోపాల గుర్తింపు
- ఆస్తిపన్ను పరిధిలో లేని నిర్మాణాలు, పన్ను ఎగ్గొడుతున్న సంస్థలు, పరిశ్రమలు, ఇతరత్రా లోపాలను గుర్తించి ప్రభుత్వ ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవడం
- డిజిటల్ ఇంటి నంబర్లతో నగరం మొత్తానికి సులువుకానున్న చిరునామాల గుర్తింపు.
ఎలా చేస్తారు అంటే : మొదట నగరం మొత్తాన్ని డ్రోన్లు చిత్రీకరిస్తాయి. తద్వారా మహానగర ప్రాథమిక పటం వస్తుంది. అందులోని జనావాసాలు, వివరాలను పటంపై ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా అన్ని అంశాలతో 3డీ పటం రూపుదిద్దుకుంటుంది.
జీఐఎస్ సర్వే : గ్రేటర్‌లో మొత్తం 25లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే పూర్తయింది. అందులో పన్ను పరిధిలో లేని 7,098(15శాతం) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాలు లెక్క తేలాయి. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.25.60కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ లోపల : గూగుల్ పటం ఆధారంగా జీహెచ్‌ఎంసీ వెలుపల 8.5లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనా.క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75లక్షలు ఉండొచ్చని అంచనా.
హెచ్ఎండీఏ మహాప్రణాళిక 2050 - హైదరాబాద్ దశ మార్చనున్న ఆ మూడే అత్యంత కీలకం
పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా '2050' - హైదరాబాద్ దిశ మార్చేలా మాస్టర్‌ప్లాన్!