150 అడుగుల లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు బాలికలు మృతి - ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని మసూరీ జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. బస్సులో ఉన్న వారంతా తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. మసూరీ - దెహ్రాదూన్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో డ్రైవర్‌తో పాటు.. మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 16 మహిళలు, 19 మంది పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన బస్సు మసూరీ నుంచి దెహ్రాదూన్ వెళుతోందని అధికారులు వెల్లడించారు. మసూరీకి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. మరోపైపు ఇదే రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ జిల్లా.. ఖతీమాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఒక డ్రైవర్ మృతి చెందాడు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు.