Honey Bell Cake Recipe in Telugu : బర్త్ డే, మ్యారేజ్ డే ఇలా అకేషన్ ఏదైనా కేక్ తప్పనిసరి. అందులోనూ న్యూ ఇయర్ లాంటి అకేషన్‌కి చాలా మంది ఎక్కువగా కేక్ కట్ చేస్తుంటారు. మరి, కొత్త సంవత్సరం వేళ మీరు కూడా కేక్ కట్ చేయాలనుకుంటున్నారా? అయితే, అందుకోసం బేకరీకి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే చాలా సులువుగా ప్రిపేర్ చేసుకునేలా మీకోసం ఒక సూపర్ కేక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "ఎగ్‌లెస్ హనీ బెల్ కేక్". టేస్ట్ కూడా బేకరీకి ఏమాత్రం తీసిపోదు! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కండెన్స్డ్ మిల్క్ - 160 గ్రాములు
- పంచదార పొడి - 75 గ్రాములు
- రిఫైన్డ్ ఆయిల్ - 90 గ్రాములు
- పాలు - 115 గ్రాములు
- వెనీలా ఎసెన్స్ - ముప్పావు టీస్పూన్
- ఎల్లో ఫుడ్ కలర్ - 3 నుంచి 4 డ్రాప్స్
- మైదా - 150 గ్రాములు
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్‌స్పూన్
- బేకింగ్ సోడా - పావుటీస్పూన్
- బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
- ఉప్పు - అరటీస్పూన్
- ఎండు కొబ్బరి పొడి - 2 టేబుల్‌స్పూన్లు
హనీ సిరప్ కోసం :
- పంచదార పొడి - 110 గ్రాములు
- హనీ - 30 గ్రాములు
- మిక్స్డ్ ఫ్రూట్ జామ్ - 100 గ్రాములు
కేక్‌పై గార్నిష్ కోసం :
- బటర్ - 50 గ్రాములు
- పంచదార పొడి - 75 గ్రాములు
- ఎండు కొబ్బరి పొడి - కొద్దిగా
ఎగ్, ఓవెన్ లేకుండానే - నోరూరించే "బ్లాక్ ఫారెస్ట్ కేక్" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
తయారీ విధానం :
- ముందుగా కేక్ తయారీ కోసం 6 ఇంచుల స్క్వేర్ టిన్(మౌల్డ్) తీసుకొని దాని లోపల బ్రష్‌తో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆపై టిన్ లోపల పార్చ్మెంట్ పేపర్ వేసి దాని పైన, అంచుల వెంబడి మరోసారి కొద్దిగా నూనె అప్లై చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఓవెన్‌ని 170 డిగ్రీల వద్ద ఉంచి 15 నిమిషాల పాటు ప్రిహీట్ అవ్వనివాలి. అయితే, ప్రిహీటింగ్కి ముందుగానే కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నింటిని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో కండెన్స్డ్ మిల్క్, పంచదార పొడి, ఆయిల్ వేసుకొని విస్కర్ సహాయంతో చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ నెమ్మదిగా బీట్ చేసుకోవాలి.
- అనంతరం వెనీలా ఎసెన్స్, ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని వీలైనంత మేర బుడగలు ఏర్పడకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లించుకున్న మైదా, కార్న్‌ఫ్లోర్, బేకింగ్ సోడా, బేకిండ్ పౌడర్, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ బుడగలు రాకుండా నెమ్మదిగా పిండిని చక్కగా కలుపుకోవాలి.
- అనంతరం ఆ పిండి మిశ్రమాన్ని ముందుగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్న కేక్ మౌల్డ్‌లో సమానంగా పోసుకొని ఓసారి గట్టిగా ట్యాప్ చేసుకోవాలి.
బేకరీ స్టైల్ "వెనీలా స్పాంజ్ కేక్" - ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా లాగిస్తారు!
- ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్‌ని పావుగంట పాటు ప్రిహీట్ చేసుకున్న ఓవెన్లో 170 డిగ్రీల వద్ద 35 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ టైమ్ అనేది మీ ఓవెన్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది.
- అయితే, కేక్ బేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్‌ని కేక్ మధ్యలో గుచ్చి చూస్తే అది క్లీన్‌గా రావాలి. అప్పుడు కేక్ చక్కగా బేక్ అయిందని గుర్తించాలి. అలా బేక్ అయినప్పుడు కేక్ మౌల్డ్‌ని బయటకు తీసి పావుగంట పాటు చల్లార్చుకోవాలి.
- ఆలోపు హనీ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని 110ఎంఎల్ వాటర్, పంచదార పొడి వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పొంగు రాగానే హనీ వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు చల్లారిన కేక్‌ని చాకు సహాయంతో సెపరేట్ చేసుకుని పార్చ్మెంట్ పేపర్ కింది వైపు ఉండేలా కేక్ బోర్డ్ లేదా ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఉండే మందపాటి లేయర్‌ను జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
- అనంతరం ఆ కేక్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న హనీ సిరప్‌ని నెమ్మదిగా కేక్ మొత్తం చెంచాతో పోసుకోవాలి. మధ్యమధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తూ కేక్ మొత్తం హనీ సిరప్ పీల్చుకునేలా పోసుకోవాలి. ఆపై దాన్ని పక్కనుంచాలి.
- ఇప్పుడు జామ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని జామ్ వేసుకొని 1 టేబుల్‌స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీదనే గడ్డలు లేని చిక్కటి సాస్‌లా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ జామ్ అనేది నీటితో కలిసి అడుగు వెంబడి ఒక పొంగు రావాలని గుర్తుంచుకోవాలి.
- ఆ విధంగా వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకొని వేడివేడి ఆ జామ్ని ముందుగా హనీ అప్లై చేసుకున్న కేక్ మీద వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆపై దాన్ని కాస్త చల్లారనివ్వాలి.
- ఆలోపు కేక్‌పై డెకర్‌కి క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక చిన్న బౌల్లో బటర్ని తీసుకొని అందులో పంచదార పొడిని కొద్దికొద్దిగా వేసుకుంటూ క్రీమ్ మాదిరిగా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మీకు నచ్చిన నాజిల్ పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు జామ్ పూసి పావుగంట పాటు చల్లార్చుకున్న కేక్‌ని తీసుకొని అంచులు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అనంతరం ఒక్కో ముక్కను తీసుకొని ఎండుకొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో కేక్ పీస్ మీద బటర్ క్రీమ్‌తో నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవాలి.
- తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే బేకరీ స్టైల్ "ఎగ్‌లెస్ హనీ బెల్ కేక్" మీ ముందు ఉంటుంది!
న్యూ ఇయర్ కోసం రొటీన్ కేక్ వద్దు - "ఎగ్‌లెస్ క్యారెట్ చీజ్ కేక్" సూపర్ - ఇలా చేయండి!