ATM నుంచి డబ్బులకు బదులు పాములు!.. జనం పరుగో పరుగు
🎬 Watch Now: Feature Video
సాధారణంగా ఏటీఎం సెంటర్లో డెబిట్ కార్డు ద్వారా మనం డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. అయితే ఏటీఎం కార్డు పెట్టగానే.. డబ్బులకు బదులు పాములు వస్తే?.. ఒక్కసారిగా షాక్ అవుతాం కదా.. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. అసలేం జరిగిందంటే?
ఇదీ జరిగింది..
జిల్లాలోని రామ్‌నగర్ కోసీ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. మెషీన్లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాము కనిపించింది. దీంతో ఒక్కసారి అతడు అరవడం వల్ల క్యూలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఆ తర్వాత అతడు ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలియజేశాడు. సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు.
అదే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్న సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కూడా ఏటీఎం వద్దకు వచ్చారు. బ్యాంకు అధికారులు.. ఏటీఎంను తెరిచారు. అందులో పది పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. చంద్రసేన్.. ఆ పాములన్నింటినీ రక్షించి అడవిలోకి విడిచిపెట్టారు. ఆ పాము పిల్లలు చాలా విషపూరితమైనవని ఆయన తెలిపారు. ఏటీఎం నుంచి పాము బయటకు వచ్చిన నేపథ్యంలో.. బ్యాంకు అధికారులు యంత్రం మొత్తాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొంతసేపు ఏటీఎంను మూసేసి మళ్లీ తెరిచారు.