Woman Gave Birth To 4 Babies : కర్ణాటకలోని మంగళూరులో తెలంగాణకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
వైద్యుల వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బానోత్ దుర్గ మంగళూరులో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె గర్భం ధరించగా, సోమవారం కంకనాడి ఫాదర్ ముల్లర్ ఆస్పత్రిలో ప్రసవించారు. సిజేరియన్ ద్వారా నలుగురు చిన్నారులకు జన్మనిచ్చారు. పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 1 కిలో, 1.2 కిలోలు, 800 గ్రాములు, 900 గ్రాముల బరువుతో చిన్నారులు జన్మించారని చెప్పారు.
అయితే నెలల నిండకుండానే పుట్టడం వల్ల పిల్లలకు NICUలో చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. 7 లక్షల మంది గర్భిణీల్లో ఒకరు మాత్రమే నలుగురి పిల్లలకు జన్మనిస్తారని గైనకాలజిస్ట్ డాక్టర్ జోలీన్ డిఅల్మేడా చెప్పారు. దుర్గకు ప్రినేటల్ కేర్ అందించామని, ప్రసవ సమయంలో వైద్యబృందం ఎంతో శ్రమించిందని వెల్లడించారు. దక్షిణ కన్నడ జిల్లా చరిత్రలో ఇది అరుదైన ప్రసవంగా అభివర్ణించారు.